ప్రేమించలేదని యువతిపై హత్యాయత్నం

  • శరీరంపై 13 కత్తిపోట్లు
  • పరారీలో నిందితుడు

ప్రజాశక్తి – వేముల (కడప) : తనను ప్రేమించలేదనే కారణంతో యువతిపై హత్యాయత్నానికి ఒడిగట్టాడు ఓ ప్రేమోన్మాది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. యువతి శరీరంపై 13 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ సంఘటన కడప జిల్లా వేముల మండలంలోని వి.కొత్తపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలి తండ్రి కథనం మేరకు.. కొత్తపల్లెకు చెందిన విఆర్‌ఎ భాస్కర్‌ కుమార్తె షర్మిలను అదే గ్రామానికి చెందిన కుళాయిప్ప అనే యువకుడు గత కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆమె తిరస్కరించడంతో చంపుతానని బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో షర్మిలపై కత్తితో దాడి చేశాడు. ఆమె తప్పించుకుని బయటకు రావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు పులివెందుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతి ఒంటిపై సుమారు 13 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు గుర్తించి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

➡️