సమిష్టి సహకారంతో ఆత్మకూరు అభివృద్ధికి కృషి

Feb 9,2025 23:32 #Anam Ramanarayana Reddy

 మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
 పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు
ప్రజాశక్తి -ఆత్మకూరు (నెల్లూరు జిల్లా) : ఆత్మకూరు నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పి నారాయణ, ఎండి ఫరూక్‌, సవిత, బిసి జనార్దన్‌ రెడ్డి, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత టిడ్కో హౌసింగ్‌ కాలనీలో ప్రజల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీసీతారాముల స్వామి వారి ఆలయ నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు. దీంతోపాటు పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నూతన అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆత్మకూరులో ఆధునీకరించిన ఆర్‌అండ్‌బి అతిథి గృహాన్ని, బిసి గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి ఆనం మాట్లాడుతూ.. ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధిలో మంత్రులు పాలుపంచుకున్నారని తెలిపారు. వైసిపి హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి సోమశిల ప్రాజెక్ట్‌ పరిస్థితి అయోమయంగా మారినా వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమశిలను పరిశీలించి సోమశిల హైలెవల్‌ కాలువ పనులను, ఆఫ్రాన్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. 2014కు ముందు తన హయాంలో మొదలుపెట్టి పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. అందరి సహకారంతోనే ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి సవిత మాట్లాడుతూ బడ్జెట్‌లో సిఎం చంద్రబాబునాయుడు బిసిలకు పెద్దపీట వేశారన్నారు. రహదారులు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. రహదారుల మరమ్మతులకు, అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. పురపాలక శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల సముదాయాల్లో రామాలయాలను నిర్మించాలని ఆనం సంకల్పించడం గొప్ప విషయమన్నారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మకూరు నియోజకవర్గం తరహాలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను అభివద్ధి చేసుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని కోరారు.

➡️