ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖ) : ఆంధ్ర యూనివర్సిటీలో ఇటీవల కాలంలో పెంచిన మెస్ ఛార్జీలను తగ్గించాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన సోమవారం ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారినుద్దేశించి సంఘం ఆంధ్ర యూనివర్సిటీ కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ విచ్చలవిడిగా మెస్ ఛార్జీలు పెరగడంతో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. హాస్టళ్లను అభివృద్ధి చేయకుండా హాస్టల్ డెవలప్‌మెంట్ ఫండ్ పేరుతో ప్రతి ఆరు నెలలకు రూ.750, టర్మ్ ఛార్జెస్ పేరుతో రూ.400 వసూలు చేస్తున్నారని, విద్యార్థులపై కరెంట్ బిల్లుల భారం మోపుతున్నారని తెలిపారు. హాస్టల్ రూమ్‌లో ఒక ఫ్యాన్, ఒక లైటుకు రూ.350 కరెంటు బిల్లు వసూలు చేస్తున్నారన్నారు. సమస్యలపై ఇప్పటికే నాలుగుసార్లు వినతులు సమర్పించినప్పటికీ ఎయు అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇతర విశ్వ విద్యాలయాలలో గరిష్టంగా మెస్ ఛార్జీలు రూ.3 వేలు వసూలు చేస్తుంటే, ఎయులో రూ.3900 – రూ.4200 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. తరగతులు ప్రారంభమైనా మెస్‌లను పూర్తిస్థాయిలో తెరవకపోవడంతో విద్యార్థులు బయటకు వెళ్లి తినాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు జి.అజరు, పి.సాయి పాల్గొన్నారు
కమిటీ ఏర్పాటు
విద్యార్థుల ఆందోళనపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధనుంజయరావు స్పందించారు. సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. సమస్యల పరిష్కారంలో భాగంగా సోమవారం సాయంత్రం 9 మందితో కూడిన కమిటీని ఆయన ఏర్పాటు చేశారు.
