సమగ్ర శిక్ష ఎస్పిడి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆటిజం విద్యార్ధుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని సమగ్ర శిక్షా డైరెక్టర్ బి శ్రీనివాసరావు అన్నారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. భవిత, ఆటిజం కేంద్రాలపై జాతీయ స్థాయి నిపుణులు, ప్రముఖ్య వైద్యులతో విజయవాడలో శుక్రవారం జరిగిన ప్రత్యేక వర్క్‌షాపులో ముఖ్యఅతిథిగా ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో దాదాపు 89వేల మంది ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు ఆటిజం కేంద్రాలు మద్దతుగా నిలుస్తాయని చెప్పారు. ప్రభుత్వంతో పాటు నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, సహకారంతో మాత్రమే కార్యరూపంలోకి తీసుకురాగలమని తెలిపారు. ఆటిజం కేంద్రాల నిర్వహణకు సలహాలు ఇవ్వాలని కోరారు. కేంద్రప్రభుత్వ విద్యాశాఖ ఎకనామిక్ ఆడ్వైజర్ ఏ శ్రీజ వర్చువల్‌గా మాట్లాడుతూ నూతన విద్యావిధానానికి అనుగుణంగా ప్రతి విద్యార్ధికి విద్యా అవకాశాలు సమానంగా లభించాలని చెప్పారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఓఎస్డి ఎ వెంకటరమణ తదితరులు పాల్గొని మాట్లాడారు.
విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు జిల్లా విద్య శిక్షణ సంస్థలు(డైట్ కళాశాలలు)ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దేందుకు రెండో విడతలో రూ.43.22 కోట్ల నిధులకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపిందని డైరెక్టర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 2028 నాటికి రాష్ట్రంలో 13 డైట్ కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు.
