అవినాష్‌ వర్సెస్‌ షర్మిల

  •  టిడిపి కూటమి అభ్యర్థి ప్రచారం
  •  అధినేతల ప్రచారంతో కేడర్‌లో జోష్‌

ప్రజాశక్తి – కడప ప్రతినిధి : పోలింగ్‌కు సమయం దగ్గరపడే కొద్దీ కడప జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కడప ఎంపి బరిలో వైసిపి, ఇండియా బ్లాక్‌ తరపున పోటీచేస్తున్న కాంగ్రెస్‌, టిడిపి కూటమి తరపు అభ్యర్థి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. వైసిపికి పార్టీ బలం, పటిష్టమైన కేడర్‌ తోడ్పాటు, టిడిపికి పార్టీ బలం, యువత మీద ఆశలు, కాంగ్రెస్‌కు మేనిఫెస్టో, సెంటిమెంట్‌ రాజకీయం ఆధారంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో అనూహ్యంగా వైఎస్‌.షర్మిల బరిలో నిలవడంతో రాజకీయం ఉత్కంఠను కలిగిస్తోంది.
కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్‌ నియోజకవర్గాలున్నాయి. వైసిపి అభ్యర్థి వైఎస్‌.అవినాష్‌రెడ్డి తరపున ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికే ప్రచారం చేశారు. అవినాష్‌ సతీమణి, డిప్యూటీ సిఎం ఎస్‌బి అంజాద్‌బాషా సతీమణి విస్తృత ప్రచారం గావిస్తున్నారు. సంక్షేమ పథకాల ఫలాలు ఏ విధంగా ప్రజలకు చేరాయో ఓటర్లకు వివరిస్తున్నారు. సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయనే ధీమాలో వైసిపి అభ్యర్ధులు ఉన్నారు. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రచారంలో ప్రధానాంశంగా చెపుతున్నారు. జగన్‌ సతీమణి భారతి పులివెందుల్లో ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు.
కాంగ్రెస్‌ అభ్యర్థి వైఎస్‌.షర్మిల, ఆమె భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర నేత తులసీరెడ్డి, ఇండియా బ్లాక్‌ తరపున సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, సిపిఐ రాష్ట్ర నాయకులు ఈశ్వరయ్య తదితరులు ప్రచారం గావిస్తున్నారు. .2017లో ప్రతిపక్ష నాయకుని హోదాలోనూ, ఆ తరువాత ముఖ్యమంత్రి హోదాలోనూ వైఎస్‌ జగన్‌…జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలైన జమ్మలమడుగులో మూడేళ్లలోనే ఉక్కు పరిశ్రమ నిర్మాణం, చెన్నూరు సుగర్‌ పరిశ్రమ, రాజోలి జలాశయం నిర్మాణం, జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2లో పనుల్ని చేపట్టకపోవడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. వైఎస్‌.వివేకా హత్య జిల్లా రాజకీయాన్ని అమాంతం మార్చేసింది. షర్మిల సెంటిమెంట్‌ రాజకీయంతో వైసిపిపై ముప్పేట దాడి చేస్తున్నారు. ఈమెకు మద్దతుగా వివేకా కుమార్తె సునీత, భర్త రాజశేఖర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు.
టిడిపి అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డికు మద్దతుగా ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. లోకేష్‌ ఒకటి, రెండు రోజుల్లో రానున్నారు. భూపేష్‌రెడ్డికి మద్దతుగా చిన్నాన్న మాజీమంత్రి సి.ఆదినారాయణరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టిడిపి కడప అభ్యర్థి ఆర్‌.మాధవి సహా ఇతర కుటుంబసభ్యులు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసిపి నుండి కొంతమంది చేరారు. దీనికి ధీటుగా మైదుకూరులో జగన్‌ సిద్ధం సభను ఏర్పాటుచేయించారు. ఈ నేపథ్యంలోనే మైదుకూరు టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ చాపాడు, బ్రహ్మంగారిమఠం మండలాల్లో చేరికల వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.. మైదుకూరు, జమ్మలమడుగు స్థానాలపై వైసిపి ప్రత్యేక దృష్టి సారించింది. షర్మిల పోలింగ్‌ వరకు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనుండడంతో వైసిపిలో గుబులు రేగుతోంది. వైసిపి ఓట్ల చీలిక ద్వారా తమ విజయావకాశాలను ఎక్కడ దెబ్బతీస్తుందనే ఆందోళన వారిలో నెలకొంది.

➡️