- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలను మానుకోవాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 1453వ రోజుకు చేరాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్ వివిధ విభాగాలకు చెందిన సిఐటియు కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్ నాయకులు ఎన్.రామారావు, డిసిహెచ్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఒకవైపు స్టీల్‌ప్లాంటును కాపాడతామని చెబుతూనే మరోవైపు ప్రయివేటీకరించడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను రక్షిస్తున్న సిఐఎస్‌ఎఫ్ విభాగ బాధ్యతలను తప్పించడమే దీనికి తొలిమెట్టు అవుతుందన్నారు. కుట్రపూరితంగా జరుగుతున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.