- కూతుర్ని ప్రేమిస్తున్నాడని యువకుడ్ని కొట్టి చంపిన తండ్రి
- ఆలస్యంగా వెలుగు చూసిన హత్య ఉదంతం
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ : అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గంలోని బి కొత్తకోటలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని యువకుడిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. ఈ హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని అయ్యప్పగారిపల్లి గ్రామం, గుట్టమీద దళితవాడకు చెందిన రంగాల వెంకటరమణ, లక్ష్మి దంపతుల రెండవ కుమారుడు సూర్యనారాయణ (25) మదనపల్లె ఎన్‌టిఆర్ సర్కిల్ వద్ద ఓ ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నారు. అదే గ్రామంలో నివసిస్తున్న డి జయన్న కుమార్తె పల్లవిని ప్రేమిస్తున్నారు. విషయం తెలిసిన జయన్న ఇటీవల సూర్యనారాయణను మందలించాడు. అంతటతో ఆగకపోవడంతో పల్లవి తండ్రి జయన్న, ఆయన అన్న అమర్నాథ్ ఆదివారం రాత్రి గ్రామ సమీపంలో సూర్యనారాయణను అడ్డగించి కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రంగా గాయపడిన సూర్యనారాయణ ఇంటికి వెళ్లి పడుకున్నాడు. తెల్లవారేసరికి ఆయన మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యులు ఆరా తీయగా జయన్య, అమర్నాథ్ దాడి చేసిన విషయం వెలుగు చూసింది. బి కొత్తకోట పోలీసులకు సూర్యనారాయణ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లి సర్వజన బోధనాస్పత్రికి పోలీసులు తరలించారు. తన బిడ్డను అన్యాయంగా కొట్టి చంపారని మృతుడు సూర్యనారాయణ తండ్రి వెంకటరమణ వాపోయారు. దాడి చేయడం వల్ల సూర్యనారాయణ చనిపోయాడా.. లేక ఇతర కారణాలతో చనిపోయాడా అన్నది పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తేలాల్సి ఉందని బి కొత్తకోట సిఐ రాజారెడ్డి తెలిపారు.