‘కూటమి’ పక్ష నేతగా బాబు

Jun 12,2024 07:59 #2024 election, #chandrababau, #TDP

-ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం
-నేడు ప్రమాణ స్వీకారం
-ఇది అత్యున్నతమైన బాధ్యత : ఎంఎల్‌ఏలతో చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్‌డిఎ శాసనసభ పక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ హాలులో జరిగిన కూటమి ఎంఎల్‌ఏల సమావేశంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు పేరును ప్రతిపాదించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు ఈ ప్రతిపాదనను బలపరచారు. కూటమి ఎంఎల్‌ఏలందరు ఈ ప్రతిపాదనను హర్షధ్వానాల మధ్య ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం కూటమి తరపున పురంధేశ్వరిచ, అచ్చెన్నాయుడు, జనసేన పిఎసి ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిశారు. కూటమి పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు 163 మంది ఎంఎల్‌ఏల సంతకాలతో ఉన్న లేఖను గవర్నర్‌కు అందచేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరారు. ఈ లేఖతో పాటు చంద్రబాబుకు మద్దతు తెలిపే లేఖలను మూడు పార్టీల నేతలు విడివిడిగా అందచేశారు. ఈ లేఖలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా చంద్రబాబును గవర్నర్‌ ఆహ్వానించారు. సాయంత్రం ఐదు గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను చంద్రబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రివర్గ ఏర్పాటు గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అంతకుముందు, ఎన్‌డిఎ కూటమి ఎంఎల్‌ఏలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు తమకు ఇచ్చింది అధికారం కాదని, అత్యున్నతమైన బాధ్యత అని అన్నారు. ప్రజల పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని చెప్పారు. ప్రజావేదికల కూల్చివేతలు, మూడు రాజధానుల ఆటలు తమ ప్రభుత్వంలో ఉండవని అన్నారు. బుధవారం నుండి రాష్ట్రంలో ప్రజాపరిపాలన సాగుతుందని, ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుందని అన్నారు. బాధ్యతాయుతమైన, పాజిటివ్‌ గవర్నమెంట్‌ను నిర్వహిస్తామని తెలిపారు.
తప్పు చేసిన వారిని క్షమించి పూర్తిగా వదిలేస్తే మళ్లీ అదే దారికి వస్తారని అన్నారు. చట్టపరంగా శిక్షించడంతో పాటు విధ్వంసం, కక్ష రాజకీయాలు చేయకుండా సరైన దారిన పెట్టాలన్నారు. రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర సహకారం కూడా అవసరమని, కేంద్రం కూడా ఆ మేరకు హామీ ఇచ్చిందని తెలిపారు.
హామీలు పూర్తిచేయాలి: పవన్‌ కళ్యాణ్‌
మానిఫెస్టోలో ఇచ్చిన మాటలన్నింటినీ పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. విద్య వైద్యం, ఉపాధి, తాగు, సాగునీరు, శాంతి భద్రతలు అన్నింటా అండగా ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చామని, ఆ మాటలను నిలబెట్టుకోవాల్సి ఉందన్నారు. బాబు జైలులో ఉన్నప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరి బాధను చూశానని, కన్నీరు పెట్టవద్దని మంచి రోజులు వస్తాయని చెప్పానని, ఇప్పుడు వచ్చాయని పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక పాలనను అంతమొందించేందుకు ప్రజలు కసిగా ఓట్లు వేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురేంధేశ్వరి అన్నారు. విజయం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి అవసరం ఉందన్నారు.

అమరావతే రాజధాని
రాష్ట్ర రాజధాని అమరావతి మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆయన రాజధాని విషయంలో ఇక సందేహాలకు ఏమాత్రం తావు లేదని అన్నారు. విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా, ప్రత్యేక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. రాయలసీమలోని కర్నూలును అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి పట్ల అన్ని విధాల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దీనివల్ల ఆర్థికంగానూ నష్టం జరిగిందని చెప్పారు. విశాఖ రాజధాని అంశాన్ని అక్కడి ప్రజలు కూడా తిరస్కరించారని, ఎన్నికల ఫలితాల్లో ఈ విషయం స్పష్టంగా కనిపించిదని అన్నారు.

➡️