మోడీతో బాబు పొత్తు, జగన్‌ తొత్తు : షర్మిల

Apr 26,2024 08:30 #CONGRES, #ys sharmila

-వారికి ఓటేస్తే డ్రెయినేజీలో వేసినట్లే
-ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి : వైఎస్‌.షర్మిల
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి, విజయవాడ అర్బన్‌:వివేకా హత్య కేసులో నిందితుడైన వైఎస్‌.అవినాష్‌రెడ్డికి బెయిల్‌ కోసం ప్రధాని మోడీ కాళ్ల దగ్గర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోకరిల్లారని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడూ ప్రధానిపై ఒత్తిడి తేలేని జగన్‌… అవినాష్‌రెడ్డిని రక్షించడానికి పదేపదే ప్రధానిని కలిశారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేసినా, జగన్‌కు ఓటేసినా డ్రెయినేజీలో వేసినట్లేనని అన్నారు. ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో చేపట్టిన న్యాయయాత్రలో భాగంగా గురువారం ఆమె విజయవాడలోని కృష్ణలంక రాణిగారితోటలోనూ, గుంటూరు తూర్పు నియోజవర్గంలోని సంజీవయ్య నగర్‌లోనూ ఎన్నికల ప్రచార సభల్లో, సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ప్రసంగించారు. అవినాష్‌రెడ్డిని వెనకేసురావడం కోసం తనను, వివేకానందరెడ్డిని జగన్‌ కించిపరిచి మాట్లాడారన్నారు. పులివెందుల సభలో వైఎస్‌ వివేకా గురించి కనీసం నాలుగు మంచిమాటలు చెప్పకుండా ఆయనపై ఉన్న కక్ష బయటపెట్టారన్నారు. అవినాష్‌రెడ్డిని వెనకేసుకురావడానికి వివేకాను కించపర్చాలా? అని ప్రశ్నించారు. పసుపు చీర ధరిస్తే చంద్రబాబుతో తాను కలిసినట్టా? అని ప్రశ్నించారు. పసుపు రంగు టిడిపి సొంతమా? చంద్రబాబు పేటెంట్‌ రంగని ఎవరైనా చెప్పారా? సాక్షి పేపరులో బేనర్‌ హెడ్డింగ్‌లో పసుపు రంగు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సాక్షి పేపరు బ్యానర్‌ తయారు చేసేటప్పుడు పసుపు మంగళకరం అని ఆయనే లోగో రూపొందించారని గుర్తు చేశారు. గత పదేళ్లుగా రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రధాని మోడీతో టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల పొత్తు పెట్టుకుంటే, సిఎం జగన్‌ ఐదేళ్లుగా మోడీకి తొత్తుగా వ్యవహరించారని, అయినా, రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేకపోయారని,ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన మోడీతో జగన్‌ అంటకాగుతున్నారని విమర్శించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే రాజధాని లేదని, మన రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి వైసిపి ప్రభుత్వ హయాంలోనే వచ్చిందని అన్నారు. చంద్రబాబు కూడా అన్నీ అబద్దాలే చెపుతున్నారని విమర్శించారు. సింగపూర్‌ లాంటి రాజధాని అన్నారని, అటువంటిదేమీ నిర్మించలేదని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో రాజధానిలో తాత్కాలిక భవనాలు నిర్మించడం తప్ప, ఏమీ అభివృద్ధి చేయలేదన్నారు. విదేశాలు వెళ్లచ్చారు తప్ప, పెట్టుబడులు తీసుకురాలేకపోయారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, రాజధాని నిర్మాణం సహా అన్ని సమస్యలకూ కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. ఇండియా వేదిక తరఫున పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ ఎంపి అభ్యర్థి వల్లూరు భార్గవ్‌, సిపిఎం విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి చిరుగుపాటి బాబూరావు, సిపిఐ విజయవాడ పశ్చిమ అభ్యర్థి జి.కోటేశ్వరరావు, సిపిఐ గుంటూరు లోక్‌సభ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌, సిపిఎం మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి జన్నా శివశంకరరావు, కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు తూర్పు అభ్యర్థి మస్తాన్‌ వలి, పశ్చిమ అభ్యర్థి జాన్‌బాబులను గెలిపించాలని కోరారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పి.రామారావు, నగర కార్యదరి కె.నళినీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️