- బాలికల వసతి గృహం వాష్‌రూములో రహస్య కెమెరాల కలకలం
- అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు విద్యార్థినుల నిరసన
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి, గుడ్లవల్లేరు, అమరావతి బ్యూరో : కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ కళాశాల బాలికల వసతి గృహం వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు అర్ధరాత్రి సమయంలో ఆందోళనకు దిగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళా కమిషన్ సుమోటోగా కేసు తీసుకుంది. విద్యార్థి సంఘాలు ఉద్యమించాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి ఈ ఘటనను తీసుకెళతామని విద్యార్థులు తెలిపారు. పోలీసులు మాత్రం రహస్య కెమెరాలు ఏవీ దొరకలేదని చెప్తున్నారు. గుడివాడ మండలం గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు ఇంజనీరింగ్ కళాశాల బాలికల వసతి గృహం వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాలు అమర్చినట్లు. ఓ విద్యార్థిని సాయంతో బిటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజరు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై వారం రోజుల క్రితమే కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా సాక్ష్యాలు కావాలంటూ చర్యలు తీసుకోకపోవడంతో గురువారం అర్థరాత్రి నుండి శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటల వరకూ సెల్‌ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వసతి గృహం వద్దే నిరసనకు దిగారు. వర్షంలోనూ ఆందోళన కొనసాగిం చారు. ‘ఉరు వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనకు కారణమైన విజరుపై విద్యార్థులు దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో విద్యార్థినులు మాట్లాడు తూ, ‘వాష్‌రూమ్‌లో కెమెరాలు అమర్చి వీడియోలు తీశారు. ఆ వీడియోలను అమ్ముకుంటున్నారు’ అని వాపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విజరును విచారించి కేసు నమోదు చేసి అతడి ల్యాప్‌ట్యాప్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆందో ళన చేస్తున్న విద్యార్థులను అదుపు చేశారు. బాలికల వసతి గృహంలో హిడెన్ కెమెరా గుర్తించార ంటూ ‘ఎక్స్’ వేదికగా కొందరు విద్యార్థులు పోస్టులు పెట్టారు. విద్యార్థినులకు సంబంధించి దాదాపు 300 వీడియోలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సెప్టెంబర్ మూడో తేదీ వరకూ కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది.
విద్యార్థి సంఘాల ఆందోళన
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు మద్దతుగా శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ తదితర విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వసతి గృహంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, విద్యార్థి సంఘాల నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎలాంటి విచారణా చేయకుండా కెమెరాలు లేవని పోలీసులు చెప్పడంపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విచారణ సక్రమంగా జరగకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు.
సమగ్ర విచారణకు ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె ప్రసన్నకుమార్, ఎ అశోక్ డిమాండ్ చేశారు. కళాశాలల్లో విద్యార్థినులకు రక్షణ కల్పించాలని ఒక ప్రకటనలో కోరారు. ఉన్నత చదువుల కోసం వస్తున్న విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు తప్ప, రక్షణ గురించి యాజమాన్యం ఆలోచించడం లేదని విమర్శించారు. వీడియోలు రికార్డింగు చేశారన్న అనుమానాలు విద్యార్థినులు లేవనెత్తారని, ఈ విషయంపై కళాశాల యాజమాన్యం తీరు సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే ఉన్నతస్థాయి కమిటీ వేసి ఎంతటి వారైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కారకులపై కఠిన చర్యలు : సిఎం
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనలో నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. విద్యార్థినిల ఆందోళనల నేపథ్యంలో డిజిపి, ఇంటిలిజెన్స్ డిజిలతో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్‌పిలతోనూ మాట్లాడారు. తక్షణమే కళాశాలకు వెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్రను ఆదేశించారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తేలితే వారిపైన కూడా కేసులు నమోదు చేయాలని, కళాశాలపైనా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థినుల బాధను అర్థం చేసుకోవాలని చెప్పారు. విద్యార్థినుల కుటుంబాలకు భరోసా కల్పించాలని, ఘటన నిర్ధారణ అయితే కారకులను వదలొద్దని అన్నారు. అదే సమయంలో విద్యార్థినులకూ ధైర్యం చెప్పాలని, అండగా ఉంటామని హామీనివ్వాలని సూచించారు.
జైత్వాని విషయంలోనూ ఆగ్రహం
బాలివుడ్ నటి జైత్వాని విషయంలో ఏస్థాయి వ్యక్తులు, అధికారులు ఉన్నా చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ఎక్కడో మహారాష్ట్రలో జరిగిన అంశాన్ని ఇక్కడకు తీసుకొచ్చి ఇక్కడ కేసు పెట్టి వేధించడం ఇవన్నీ చూస్తుంటే వైసిపి పాలకులకు ఆడపిల్లలంటే కనీస గౌరవం లేదని అర్థమవుతోందన్నారు.
సుమోటోగా కేసు తీసుకున్న మహిళా కమిషన్
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారాన్ని మహిళా కమిషన్ సుమోటోగా కేసు తీసుకుంది. దీనిపై కళాశాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు చైర్‌పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మి తెలిపారు. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. యాజమాన్యం విచారణకు హాజరు కావాల్సి ఉందని, ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
ఐదుగురు మహిళా సిబ్బందితో ప్రత్యేక బృందం ఏర్పాటు : మంత్రి కొల్లు రవీంద్ర
పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విచారణకు ఐదుగురు మహిళా సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డికె బాలాజీ, ఎస్‌పి గంగాధరరావు శుక్రవారం ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. కళాశాల యాజమాన్యం విద్యార్ధులను వేధింపులకు గురిచేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
న్యాయం జరిగే వరకూ కళాశాలకు వెళ్లం.. మంత్రికి స్పష్టం చేసిన విద్యార్థినులు
కళాశాల యాజమాన్యంపై తమకు నమ్మకం లేదని, రహస్య కెమెరాల విషయం వారం రోజుల క్రితమే కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా నొక్కి పెడుతోందని మంత్రి దృష్టికి విద్యార్థినులు తెచ్చారు. ఈ సంఘటనపై ఫిర్యాదు చేస్తే చర్యలు ఉంటాయని యాజమాన్యం బెదిరిస్తోందని వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకూ కళాశాలకు వెళ్లబోమని వారు ముక్తకంఠంతో నినాదాలు చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, కళాశాల విద్యార్థినులకు పూర్తి రక్షణ కల్పిస్తామని, ఈ సంఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వసతి గృహం వార్డెన్, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రహస్య కెమెరాలు లేవు : ఎస్‌పి గంగాధరరావు
ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సంఘటనపై జిల్లా ఎస్‌పి గంగాధరరావు మాట్లాడుతూ బాలికల వసతి గృహంలో ఎలాంటి రహస్య కెమెరాలూ లేవన్నారు. నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరిశీలించినట్లు చెప్పారు. విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు గుడివాడ క్రైమ్ సిఐ రమణమ్మను ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు. ఆమెతోపాటు మరో ఐదుగురితో విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు.
కాలేజీ అనుమతులు రద్దు చేయాలి : వైసిపి
గుడ్లవల్లేరు ఇంజనీరింగు కాలేజీ అనుమతులను రద్దు చేయాలని వైసిపి ప్రతినిధి పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థినులు వర్షాన్ని లెక్క చేయకుండా గంటల తరబడి నిరసనలు చేస్తున్నా పోలీసులు వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా హోంమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు.
దోషులను శిక్షించాలి : పురందేశ్వరి
గుడ్లవల్లేరు కళాశాల లేడీస్ హాస్టల్‌లో సిసి కెమెరాలు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.