ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. వివేకా హత్య కేసులో నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజరు కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. వివేకా హత్య కేసులో ఉదరు కుమార్ రెడ్డి పాత్రపై సిజెఐ ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన తరువాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి తప్పుడు ప్రచారం చేసిన వారిలో ఉదరుకుమార్ రెడ్డి ఒకరని సునీత తరపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదరు కుమార్ రెడ్డి కూడా ఉన్నారని పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం ఉదరు కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గతంలో దాఖలైన వైఎస్ అవినాష్‌రెడ్డి సహా మిగతా నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లకు జత చేసి విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. గతంలో దాఖలైన పిటిషన్లతో ఈ పిటిషన్‌ను జత చేయాలని ఆదేశించింది.
