ప్రజాశక్తి- గుంటూరు లీగల్ : సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు, వారి ఫొటోలు మార్ఫింగ్ చేశారనే కేసులో గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న సినీనటుడు పోసాని కృష్ణమురళికి షరతులతో బెయిలు మంజూరైంది. గుంటూరు 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి (ఇన్‌ఛార్జి ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి) బెయిల్‌ను మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో ఇద్దరు ష్యూరిటీలు ఇవ్వాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం వదిలి వెళ్లరాదని బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రతి మంగళ, గురువారాల్లో మంగళగిరి సిఐడి పోలీస్ స్టేషన్‌లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య హాజరవ్వాలని నిబంధన విధించారు. కేసు విచారణ పూర్తయ్యేంత వరకు ఈ విషయాలను ఎక్కడా బహిరంగ ప్రకటనలు లేదా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులుగానీ, ప్రెస్‌మీట్‌లోగానీ పెట్టరాదని పేర్కొన్నారు. సాక్షులను, ఇతర ముద్దాయిలను పోసాని కలవరాదని, విచారణకు సహకరిస్తూ అవసరమైనప్పుడు కోర్టుకు హాజరవ్వాలని బెయిల్ ఉత్తర్వుల్లో షరుతులు విధించారు.
