ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సినీ నటుడు, దర్శకుడు, రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేస్తూ నరసరావుపేట ప్రధాన జూనియర్ సివిల్ న్యాయాధికారి రెడ్డి ఆశీర్వాదం పాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్కరు రూ . పది వేలు పూచికత్తు చొప్పున ఇరువురు జామీన్ సమర్పించాల్సి ఉంటుందని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. పిటి వారెంట్ పై అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలు నుంచి ఈనెల మూడున నరసరావుపేట 2వ పట్టణ పోలీసులు నరసరావుపేట కోర్టుకు పోసానిని తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. గుంటూరు జిల్లా జైలుకు రిమాండ్ తరలించగా అక్కడి నుంచి కర్నూలు పోలీసులు కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. పిటి వారంట్‌పై కర్నూలు జిల్లా జైలు నుంచి విజయవాడ భవానీపురం పోలీసులు ఇటీవల విజయవాడకు తరలించారు. తిరిగి విజయవాడ నుంచి కర్నూలు తరలించారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి కర్నూలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు పోలీస్‌స్టేషన్లలో కేసు నమోదైన విషయం తెలిసిందే.
