బాలాజీ సేవలు మరువలేనివి

  • ఎపిఎన్‌జిఒ రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో సబ్‌ రిజిస్ట్రార్‌గానేకాక సాటి ఉద్యోగుల సమస్యలపై గళమెత్తుతూ… నాయకుడిగా ఉంటూ.. ఉద్యోగ విరమణ చేస్తున్న బాలాజీ సేవలు మరువలేనివని ఎపిఎన్‌జిఒ రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ డిపార్ట్‌మెంటులో వివిధ హోదాలో పనిచేయడంతోపాటు రిజిస్ట్రేషన్‌ శాఖలో అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా, గిరిజన సంఘాల్లో, ఎన్‌జిఒ సంఘంలో వివిధ హోదాల్లో పనిచేసిన బాలాజీ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కెవి శివారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలాజీ జాతీయ స్థాయిలోనూ గిరిజన ఉద్యోగుల సంఘానికి సలహాదారుగా ఉన్నారని, ఉద్యోగులకు సంబంధించిన అనేక ఉద్యమాలలో మంచి పాత్ర పోషించారని అన్నారు. సామాజికంగానూ గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ సమస్యలను జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లి పోరాటం చేశారని తెలిపారు.
ఎన్‌జిఒ సంఘం రాష్ట్ర నాయకులు విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. బాలాజీతోపాటు కుటుంబం కూడా నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు కుటుంబమని తెలిపారు. పోలవరం నిర్వాసిత గిరిజనుల సమస్యలను రాష్ట్రపతి స్థాయికి తీసుకెళ్లి పరిష్కరించడంలోనూ బాలాజి కృషి వుందని పేర్కొన్నారు. అనంతరం బాలాజీ దంపతులను మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య, సిపిఎం సీనియర్‌ నాయకులు పి మధు, సిహెచ్‌ బాబూరావు, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు రామారావు, ప్రసాద్‌ తదితరులు ఘనంగా సత్కరించారు.

➡️