అనంతలో ప్రయివేటు విద్యాసంస్థల బంద్‌

  • శ్రీ ‘నారాయణ’ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి
  •  ప్రభుత్వం స్పందించకపోతే ‘చలో విజయవాడ’
  •  విద్యార్థి జెఎసి నాయకులు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ప్రయివేటు విద్యా సంస్థల బంద్‌ విజయవంతమైంది. ఫీజుల పేరుతో చేస్తున్న దోపిడీ అరికట్టాలని, కార్పొరేట్‌, ప్రయివేటు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని, మృతి చెందిన నారాయణ కళాశాల విద్యార్థి చరణ్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని, నారాయణ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ బైక్‌ ర్యాలీలు, నిరసనలు తెలిపారు. అనంతపురం నగరంలో విద్యార్థి సంఘాల జెఎసి నేతలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులో మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వారం రోజుల క్రితం నారాయణ విద్యా సంస్థలో ఓ విద్యార్థి కళాశాల భవనం పైనుంచి దూకి మరణిస్తే ఇంత వరకు విద్యా సంస్థల యాజమాన్యాలపై కేసులు నమోదు చేయలేదన్నారు. ఈ విషయంపై జిల్లా పోలీసు యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదన్నారు. మంత్రి నారాయణ కళాశాల కాబట్టే ఇంత వరకు విద్యా సంస్థల యాజమాన్యాలపై కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న ఆర్‌ఐఒ వెంకటరమణనాయక్‌ కనీసం కళాశాల వైపు కన్నెత్తి చూడకుండా, విచారణ జరపకుండా తమ కార్యాలయానికి పరిమితమయ్యారని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జిల్లా ఆర్‌ఐఒ వెంకటరమణ నాయక్‌ను సస్పెండ్‌ చేయాలని, మంత్రి నారాయణను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని, విద్యార్థి మృతికి కారణమైన నారాయణ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే త్వరలో చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఆందోళనలో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌యుఐ, ఎఐఎస్‌బి, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ విద్యార్థి సమైక్య, వైఎస్‌ఆర్‌ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.

➡️