ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కోడూరుపాడు గ్రామంలో ఊళ్ళమ్మ తల్లి కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా ఎడ్ల బండలాగుడు పందేలను శనివారం నిర్వహించారు. ఈ పోటీల్లో కడప, గుంటూరు, కృష్ణా, తెలంగాణ జిల్లాల నుంచి ఎడ్లు పోటీ పడ్డాయి. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నాయకులు గిరిధర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా ఈ ఎడ్ల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఉళ్లమ్మ కుంభాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని ఏటా ఎడ్ల పందేలను నిర్వహిస్తున్నామన్నారు. బోరెడ్డి కేశవరెడ్డి పెద్దకోటాల, సుంకి సురేందర్ రెడ్డి హుజుర్ నగర్ (సూర్యాపేట) ఎడ్లు మొదటి స్థానం సాధించి లక్ష రూపాయల బహుమతిని కైవసం చేసుకున్నాయి. రెండవ బహుమతి కుర్ర వెంకటేష్ యాదవ్ (మైదుకూరు) కు చెందిన ఎడ్లు సాధించాయి. వీరికి రూ.80 వేల నగదు బహుమతిని అందజేశారు. పిఆర్ పులగం తిషగరెడ్డి జస్విత రెడ్డి (కుంచనపల్లి, గుంటూరు) ఎడ్లు మూడవ స్థానం సాధించి రూ.60,000 బహుమతిని గెలుపొందాయి.