ఆ దిశలో చర్యలకు అధికారులకు ఆదేశాలు
లింకేజి కాని వారు రాష్ట్రంలో 50 లక్షలమంది
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రతి ఒక్కరికి ఆధార్, బ్యాంకు ఖాతాలు తప్పని సరిగా ఉండేలా చూడటంతో పాటు, వాటిని అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ దిశలో సాధ్యమైనంత త్వరగా నూరుశాతం లక్ష్యాలను చేరుకోవాలని సూచించింది. బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం కాని వారు రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ కారణంగానే సంక్షేమ పథకాల నిధులు మంజూరుచేసినా లబ్ధిదారుల ఖాతాల్లో చేరడం లేదని అధికారులు అంటున్నారు. ప్రతి ఒక్కరి ఆధార్‌తో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 0-6 ఏళ్ల వయస్సులోపు చిన్నారులకు సంబంధించి మహిళా శిశుసంక్షేమ శాఖ పరిధిలో 11 లక్షల మందికి ఆధార్ కార్డులు లేవని కూడా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. చిన్నారుల వివరాలను నూతనంగా నమోదు చేయడం, వారి బయో మెట్రిక్ తీసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇటీవల విజయవాడ నగరంలో బుడమేరు సృష్టించిన వరద ప్రవాహంతో వందలాది కుటుంబాలు కకా వికలమయిన సంగతి తెలిసిందే. బాధితుల గృహాలకు సకాలంలో జిపిఎస్ మ్యాపింగ్ లేక పోవడంతో వారికి ప్రభుత్వ సహాయం అందలేదనే విమర్శలు వినవచ్చాయి. భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఇంటిని జిపిఎస్ మ్యాపింగ్ చేయడంతో పాటు ఆధార్, బ్యాంక్ లింకేజీ కాని వారిని గుర్తించి వారి ఖాతాలకు లింకేజీ చేయించడం, ఇప్పటి వరకు అకౌంట్ లేని వారికి పోస్టాఫీసుల ద్వారా ఎన్‌పిసిఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అకౌంట్‌ను తెరిపించి వారి ఖాతా నెంబరుని కూడా ఆదార్‌కు లింక్ చేయాలని కూడా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బాధ్యతలు అప్పజెప్పింది. అంతే కాకుండా సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్ళి ఆయా గృహాలను జిపిఎస్‌తో లింక్ చేయడం, ఇంటిలో ఆదార్ లేని వారు ఉంటే వారి ఆధార్ కొత్తగా నమోదు చేయించడం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉండే జిపిఎస్ మ్యాపింగ్‌ను ఇక పై ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోకి బదిలీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.