వయోజనులందరికీ బిసిజి టీకా

  •  16న 12 జిల్లాల్లో తొలి విడత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 18 ఏళ్లు నిండిన వారందరికీ బిసిజి టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ నెల 16 నుంచి 12 జిల్లాల్లో మొదటి విడతగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వైద్యారోగ్యశాఖ కమిషనరు ఎస్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2025 నాటికి రాష్ట్రంలో టిబిని నిర్మూలించడంతోపాటు, కేసులను గణనీయంగా తగ్గించేందుకు ఈ టీకా అందజేస్తున్నట్లు వారు ప్రకటించారు. తొలి విడతగా అల్లూరి సీతారామరాజు, విశాఖ, విజయనగరం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆరు కేటగిరీలకు చెందిన అర్హులైన వ్యక్తులకు మూడు నెలల వ్యవధిలో ఈ టీకా అందించనున్నట్లు వారు వివరించారు. జిల్లా క్షయ నివారణ, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారుల సంయుక్త ఆధ్వర్యాన ఈ కార్యక్రమం ఉంటుందని, క్షేత్రస్థాయిలో ఎఎన్‌ఎం, ఆశా, సిహెచ్‌, టిబి ఛాంపియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే నోడల్‌ ఆఫీసర్లను నియమించామని చెప్పారు. ఐదేళ్ల క్రితం టిబి మందులు వాడి తగ్గించుకున్నవారు, ధూమపానం అలవాటు ఉన్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, తదితరులకు ఈ టీకా వేస్తామని వెల్లడించారు. బిసిజి టీకా వయోజనులకు సురక్షితమైనదని, టిబి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ టీకా వేసుకోవాలని అధికారులు కోరారు.

➡️