- ప్రజా చైతన్య యాత్రలో వి. శ్రీనివాసరావు
ప్రజాశక్తి – యంత్రాంగం : స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజలంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నెల్లూరు, ఎన్‌టిఆర్, పశ్చిమగోదావరి, అనకాపల్లి, విజయనగరం జిల్లాలోనూ ప్రజాచైతన్య యాత్రలు చేపట్టారు. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సిపిఎం బృందం ముందుకు సాగింది.
రెండోరోజు ప్రజా చైతన్యయాత్ర శనివారం కాకినాడ తాళ్లరేవు మండలం సీతారామపురం నుంచి ప్రారంభమైంది. మాధవరాయునిపేట, పోలేకుర్రు, తోటపేట, తూర్పుపేట, పి.మల్లవరం గ్రామాల్లో సాగింది. రెడ్డివారిపేటలో రెడ్డి శ్రీదేవి, రెడ్డి వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ఇంటింటికీ కుళాయిలు వేశారని, ఏడు నెలలు గడిచినా నేటికీ తాగునీరు సరఫరా చేయడం లేదని తెలిపారు. పోలేకుర్రు పంచాయతీ పరిధిలోని తోటపేటకు చెందిన పేద రైతులు కొండబాబు, లక్ష్మణరావు మాట్లాడుతూ.. గ్రామంలో 30 ఏళ్లుగా 60 ఎకరాల రాణిగారి భూములను సాగు చేసుకుంటున్నామని, వీటికి పట్టాలిస్తామని ప్రజాప్రతినిధులు చెప్పడం తప్ప నేటికీ ఇవ్వలేదని వాపోయారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వి శ్రీనివాసరావును కోరారు. సాగునీరు అందడం లేదని పోలేకుర్రు పంచాయతీ తూర్పుపేటకు చెందిన రైతులు తెలిపారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మండలంలోని శివారు భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. వరి పంట పొట్టదశలో ఉందని, ఈ సమయంలో నీటిని అందించకపోతే రైతులు నష్టపోతారన్నారు. నీలపల్లిలో దళిత శ్మశాన వాటికలో ముంపు నివారణా చర్యలు చేపట్టాలని కోరారు.
అమరవీరుల స్థూప నిర్మాణానికి శంకుస్థాపన
తాళ్లరేవు మండలం నీలపల్లిలో నూతనంగా నిర్మించనున్న అమరవీరుల స్థూపానికి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. 1950 దశకంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు నీలపల్లి గ్రామంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించిన కమిడి వెంకటనారాయణ, మాతా వేమనాచార్యులు, దడాల మహాలక్ష్మి, మేడిశెట్టి నీలాద్రిలకు గుర్తుగా దీనిని నిర్మిస్తున్నట్టు సిపిఎం నాయకులు తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రం లంకాపట్నం హుదూద్ ఇళ్ల సముదాయం వద్ద నిర్వహించిన యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 2009లో నిర్మించిన హుదూద్ ఇళ్లు, పదేళ్ల క్రితం నిర్మించిన టిడ్కో ఇళ్లను నేటికీ లబ్దిదారులకు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిధిలోని తాడేరు టిడ్కో గృహ సముదాయాల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య సైకిల్ యాత్రను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం ప్రారంభించారు. ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి, నెల్లూరు, విజయవాడలో యాత్రలు కొనసాగాయి.