ఎలుగు బంటి దాడిలో ఇద్దరు మృతి – మహిళకు తీవ్ర గాయాలు

– న్యాయం చేయాలని మృతదేహాలతో ఆందోళన
ప్రజాశక్తి-వజ్రపుకొత్తూరు, పలాస (శ్రీకాకుళం జిల్లా):శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బంటి బీభత్సం సృష్టించింది. జీడి తోటలో పని చేస్తున్న ముగ్గురిపై దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఉద్దానం ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి గ్రామానికి చెందిన చీడిపల్లి లోకనాథం (47), సావిత్రి దంపతులు తమ జీడి తోటలో పని చేస్తున్నారు. ఇంతలో ఎలుగుబంటి ఒక్కసారిగా వచ్చి లోకనాథంపై దాడి చేసి చంపేసింది. భర్తను కాపాడే సమయంలో సావిత్రిపైనా దాడి చేసి గాయపరిచింది. వెంటనే ఆమె బంధువులైన కూర్మారావుకు ఫోన్‌లో సమాచారం అందజేసింది. కూర్మారావు గ్రామస్తులతో కలిసి ట్రాక్టర్‌పై అక్కడకు చేరుకున్నారు. ఎలుగు బంటి ఒక్కసారిగా ట్రాక్టర్‌ ఎక్కి కూర్మారావుపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనను చూసి గ్రామస్తులందరూ భయంతో వణికిపోయారు. వెంటనే గాయపడిన సావిత్రిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలుగు బంటిని బంధించేందుకు చర్యలు ప్రారంభించారు. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఉద్దాన ప్రాంతంలో ఎలుగు బంట్లు సంచరిస్తున్నాయని, వాటి దాడిలో ప్రజలు మృత్యువాత పడుతున్నారని కాశీబుగ్గ అంబేద్కర్‌ విగ్రహం వద్ద మృతదేహాలతో గ్రామస్తులు ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని వారిని శాంతింపజేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై ఫారెస్టు అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.

➡️