Vijayawada బస్టాండ్‌లో యాచకులు-బ్లేడ్‌ బ్యాచ్‌ల వీరంగం

విజయవాడ : విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ఆదివారం వేకువజామున యాచకులు, బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం సృష్టించారు. ఈరోజు వేకువజాము 4 గంటల సమయంలో అక్కడి పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు.

పోలీసుల వివరాల మేరకు … మద్యం తాగిన యాచకులు, బ్లేడ్‌ బ్యాచ్‌ బస్టాండ్‌లోని బెంచీలను ఆక్రమించుకుని నిద్రించారు. దీంతో తీవ్ర ఇబ్బందిపడిన ప్రయాణీకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈక్రమంలో వారిని నిద్ర లేపడానికి ప్రయత్నించిన పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసేందుకు ఒక్కసారిగా సుమారు వందమందికి పైగా దూసుకొచ్చారు. బ్లేడ్లతో దాడికి యత్నించడంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరుగులుతీశారు. ఈ ఘటనలో సాంబయ్య అనే ఆర్టీసీ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ తరువాత అదనపు పోలీసులు రావడంతో నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. దాడికి పాల్పడినవారిలో కొందరిని పోలీసులు పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రైల్వేస్టేషన్‌లోకి యాచకులు, బ్లేడ్‌ బ్యాచ్‌ను రానివ్వకపోవడంతో వారంతా బస్టాండ్‌కు వస్తున్నారు.

➡️