- గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు వేదిక
- అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్
ప్రజాశక్తి- అరకులోయ (అల్లూరి జిల్లా) : అరకులోయలో మూడు రోజులపాటు జరగనున్న చలి ఉత్సవ్‌ను అల్లూరి జిల్లా కలెక్టర్ ఎఎస్.దినేష్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అరకు రైల్వే స్టేషన్ నుంచి డిగ్రీ కళాశాల మైదానం వరకు 5కె రన్ నిర్వహించారు.
శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఉత్సవాలనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అరకు చలి ఉత్సవ్ వేదికగా నిలుస్తుందన్నారు. ఈ ఉత్సవ్‌కు ఎనిమిది రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చారని తెలిపారు. ఈ ఉత్సవ్‌లో మధ్యప్రదేశ్ నుంచి మాడగడలో పారగ్లైడింగ్, హార్ట్ హెయిర్ బెలూన్, హెలికాప్టర్ రైడ్ ఆకర్షించనున్నట్లు చెప్పారు. ఉత్సవం సందర్భంగా అరకు అందాలను వీక్షించడానికి గగనంలో విహరించడానికి సామాన్యులు కూడా ఇది మంచి తరుణమన్నారు.
ఏటా అరకు ఫెస్టివల్ : టూరిజం ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్
అరకు చలి ఉత్సవ్ సందర్భంగా పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఏటా అరకులో చలి ఉత్సవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో ఫెస్టివల్ నిర్వహించడానికి కేలండర్ రూపొందిం చామని చెప్పారు. పర్యాటక అభివృద్ధికి అరకు అనువైన ప్రదేశమన్నారు. అభివృద్ధి చేస్తే మరింత మంది టూరిస్టులు ఎక్కువ సమయం గడుపుతారని తెలిపారు.
విశాఖపట్నం నుంచి అరకుకు పర్యాటకుల సౌకర్యార్థం హెలికాప్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అడ్వెంచర్ టూరిజం పెట్టే ఆలోచన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటిడిఎ పిఒలు వి.అభిషేక్, కట్ట సింహాచలం, అపూర్వ భరత్, అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కెఆర్.కల్పశ్రీ, పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, పాడేరు ఎఎస్‌పి ధీరజ్, చింతపల్లి ఎఎస్‌పి నవ్‌జ్యోతి మిశ్రా తదితరులు పాల్గొన్నారు.