కార్పోరేట్లకే ప్రయోజనం

  • ప్రజల కొనుగోలు శక్తి పెంచే ఒక్క పధకమూ లేదు
  • కేంద్ర బడ్జెట్‌పై సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు

ప్రజాశక్తి-సీతారాం ఏచూరి నగర్‌ : కేంద్ర బడ్జెట్‌ కార్పొరేట్‌ శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ఉందే తప్ప ప్రజలకు ఏమీ మేలు చేయదని సిపిఎం పోలిట్‌బ్యూరోసభ్యులు బి.వి. రాఘవులు వ్యాఖ్యానించారు. నెల్లూరులో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్బంగా ఇక్కడి మల్లు స్వరాజ్యం, రుదద్రరాజు సత్యనారాయణ ప్రాంగణంలో శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ధిక సర్వేచూసినా..పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చూసినా తేడా ఏమీలేదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మద్యతరగతి ప్రజానీకాన్ని ఆకర్షించేందుకు ఆదాయపు పన్ను శ్లాబ్‌ రేట్లలో మార్పు వంటివి కొన్ని చేశారన్నారు. పెరిగిన ధరలను బట్టి చూస్తే దాని ప్రభావం కూడా పరిమితమేనన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ, ఈ ఏడాది జరగబోయే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి రాజకీయ లభ్దిపొందేందుకు అరకొర రాయతీలు ప్రకటించిందన్నారు. ఆర్దిక వ్యవస్థ సమస్యల్లోనూ, సంక్షోభంలో ఉందని ఆర్థిక సర్వే చెప్పిన విషయాని ఆయన గుర్తు చేశారు. బడ్జెట్‌లో ప్రజల కొనుగోలు శక్తి పెంచే ఒక్క పదకం కూడా లేదన్నారు. అదానీ, అంబానీ వంటి బడా కార్పోరేట్లకు అధికలాభాలు కల్పించేలా ఉందన్నారు.ఆదాయపన్నుల రాయితీలు పెద్దగా లేవన్నారు.పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే ఉద్యోగులకు లాభం జరిగేదని, ఆ పని కూడా ఈ బడ్జెట్‌లో చేయలేదన్నారు.గత బడ్జెట్‌లో ఉన్న ఇన్సెంటివ్స్‌ మాత్రమే ఇపుడూ చూపారన్నారు. అన్ని రాష్ట్రాలకు మద్దతుగా లేదన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాలను ఆదుకునేలా కనిపించడంలేదన్నారు. పన్నుల ఆదాయంలో ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్నారని, దాన్ని 50శాతానికి పెంచాలన్న డిమాండ్‌ను ఆర్థిక మంత్రి పెడచెవిన పెట్టారని ఆయన విమర్శించారు. ప్రజల చేతికి డబ్బులు ఇవ్వకుండాకొనుగోలు శక్తి ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు.మరో అంశం సంస్కరణలు వేగవంతం చేస్తామని చెప్పారని, ఇది చాలా ప్రమాదకరన్నారు.బీమా రంగంలోకి ఎఫ్‌డిఐని 100శాతం పెంచుతున్నామన్నారు. మైనింగ్‌, మెరైన్‌,విద్యుత్‌ రంగాలను ప్రవేటీకరణ చేయడానికి సిద్దమయ్యారన్నారు.అప్పులు చేసేందుకు, అదానిని ప్రోత్సహించేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయన్నారు. అసెట్‌ మోనిటైజేషన్‌ ప్రక్రియతో రూ.10లక్షల కోట్లు రాబట్టుకోవాలనే ఆలోచన చేస్తున్నారన్నారు. ఇది ప్రజల ఆస్తులు అమ్మి కార్పోరేట్లకు దోచిపెట్టడం కాదా?అని ఆయన ప్రశ్నించారు. ఆస్తులు అమ్మకానికి పెడితే కారుచౌకగా కార్పోరేట్‌శక్తులు కొంటాయన్నారు.అపుడు ప్రజలకు ఏమీ మిగలదన్నారు.మరో అంశం చట్టాలను సరళీకరణ చేయడం మార్గంగా పెట్టుకున్నారన్నారు. కార్మికులు, ఉద్యోగులపై దాడులు చేసి వారిని ఇబ్బంది పెట్టకుండా ఇపుడు కొన్ని చట్టాలున్నాయన్నారు. వాటిని ఎత్తేస్తే అసలు నియంత్రణ లేకుండా పోతుందన్నారు. ప్రజలను స్వేచ్చగా దోచుకోవడానికి కార్పొరేట్లకు ఇది వీలు కల్పిస్తుందన్నారు. బడ్జెట్‌లో మంచి మాటలున్నాయే తప్ప కేటాయింపుల్లేవన్నారు. ఏఐ,స్కిల్డ్‌ వంటి మాటలు వినిపించాయే తప్ప అభివృద్దికి ఎటువంటి కేటాయింపులూ లేవన్నారు. అందుకే కార్పోరేట్లకు మేలు చేసే ఈబడ్జెట్‌ను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.

➡️