- ముఖ్యమంత్రికి ఇఎఎస్ శర్మ సూచన
ప్రజాశక్తి-అమరావతి సౌర విద్యుత్ కొనుగోలులో అదానికి లాభాలు ఇచ్చే బదులు, ఆ లాభాలను వినియోగదారులకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి గురువారం ఆయన ఒక లేఖ రాశారు. సోలార్ కుంభకోణాన్ని దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ కొద్ది రోజుల క్రితం రాసిన లేఖను ఆయన ప్రస్తావించారు. ఆ లేఖపై ఇప్పటివరకు స్పందించకపోవడమే కాక, అదానితో చేసుకున్న ఒప్పందం గడువును పొడిగించడం ఆశ్చర్యాన్ని, బాధను కలిగించిందని పేర్కొన్నారు. ఏ కారణం వల్లనో అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేయడానికి ప్రభుత్వం సంకోచిస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అదాని ఒప్పందాన్ని రద్దు చేయాలని తాజా లేఖలోనూ ఆయన సిఎంను కోరారు. అదాని ఒప్పందం వల్ల కలిగే భారాన్ని వినియోగదారులపై రుద్దే బదులు, ఆ సోలార్ ప్యానళ్లను కోట్లాదిమంది వినియోగదారుల ఇళ్లలో, రైతుల పొలాల్లో పెట్టాలని, అక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్‌ను వారి అవసరాలకుపోను మిగిలిన దానిని డిస్కామ్‌లకు గిట్టుబాటు ధరలకు 25 ఏళ్లపాటు అమ్మే అవకాశాన్ని కల్పించాలని సూచించారు. ఈ దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, అదానికి వచ్చే లాభాలు వినియోగదారులకు లభించడంతోపాటు, వారికి మిగులు విద్యుత్‌ను అమ్మడం కారణంగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం కలుగుతుందని తెలిపారు. అమెరికా ప్రభుత్వం ఈ దిశలో 1978లోనే పబ్లిక్ యుటిలిటి రెగ్యులేటరీ పోలీస్ యాక్ట్ (పర్సా)ను తీసుకువచ్చిందని ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆ చట్టం ప్రకారం వినియోగదారులు సోలార్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తిచేసి, వారి ఉపయోగాలకు పోనూ మిగిలిన దానిని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అమ్మే అవకాశాన్ని కలిగించారని తెలిపారు. ఇతర కంపెనీల నుండి కొనే అత్యంత ఖరీదైన ధరకే వినియోగదారులనుండి కూడా కొనుగోలు చేయాలన్న షరతును ఆ చట్టంలో అమెరికా ప్రభుత్వం విధించిందని తెలిపారు. ఈ తరహాలోనే రాష్ట్రంలోనూ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అదాని విద్యుత్‌ను కొనుగోలు చేయడంలో వినియోగదారులు భరించాల్సిన ధరకు సమానంగా వారి వద్దనుండి డిస్కమ్‌లు మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేసేలా షరతు విధించాలని ఆయన సూచించారు. అప్పుడే, రాష్ట్రంలో సోలార్ ఉత్పత్తి వికేంద్రీకృతమవుతుందని తెలిపారు. సెకి ఒప్పందం ద్వారా వినియోగదారులపై పడిన భారానికి తగిన నష్టపరిహారాన్ని ఇవ్వాలని, ఆ మొత్తాన్ని అందుకు బాధ్యులై లంచాలు తీసుకున్న నేతలు, అధికారుల నుండి వసూలు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం ఆ ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.3,850 కోట్ల భారం పడుతుందని, అందుకు బాధ్యులైన నేతలు, అధికారుల నుండి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని సూచించారు. అదానికి లాభం కలిగించేందుకు ఉద్దేశించిన స్మార్ట్‌మీటర్ల ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవాలని, అదాని కంపెనీలకు కట్టబెట్టిన ప్రాజెక్టులను రద్దు చేయాలని, కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. 2014 నుండి అదాని కంపెనీలకు భూములను, ఇతర వనరులను ఉదారంగా అప్పగించారని, అటువంటి వాటన్నింటి మీదా నిష్పాక్షికమైన దర్యాప్తు నిర్వహించాలని ఇఎఎస్ శర్మ సూచించారు.