- ఎస్‌డబ్ల్యూఆర్‌ఇఐఎస్ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎపిఎస్‌డబ్ల్యూఆర్‌ఇఐఎస్) కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. సొసైటీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎయిమ్స్‌తో ఎపిఎస్‌డబ్ల్యూఆర్‌ఇఐఎస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిమ్స్ రీసెర్చ్ డీన్ వి దీప్తి, ఎపిఎస్‌డబ్ల్యూఆర్‌ఇఐఎస్ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రాజెక్టులో భాగంగా ఎయిమ్స్ వైద్య నిపుణులు కౌమార దశలో ఉన్న పిల్లలతో వ్యవహరించాల్సిన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారని చెప్పారు. ఈ ప్రాజెక్టు కౌమార దశలో ఏర్పడే అడ్డంకులను పిల్లలు సులభంగా అధిగమించేందుకు సహాయపడుతుందన్నారు. పిల్లలకు ఆరోగ్య పరీక్షలు, కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌డబ్ల్యూఆర్‌ఇఐఎస్ అదనపు కార్యదర్శి కె సునీల్ రాజ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి ఎన్ సంజీవరావు, ఎయిమ్స్ హెచ్‌ఒడిలు రాజీవ్ అరవిందాక్షం, విజరు చంద్రరెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ సత్యనారాయణన్ తదితరులు పాల్గొన్నారు.