ఘనంగా ముగిసిన భగత్‌ సింగ్‌ ఫెస్ట్‌

  • భగత్‌సింగ్‌, గాంధీ స్ఫూర్తితో డగ్స్‌ నిర్మూలనకు ఉద్యమిద్దాం : ఎస్‌ఎఫ్‌ఐ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మత్తు పదార్థాలతో ఆనందం రాదు… విజ్ఞానం, వినోదంతో మెరుగైన ఆనందం అంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విజయనగరం గురజాడ కళాభారతి ఆవరణంలో నిర్వహించిన భగత్‌సింగ్‌ ఫెస్ట్‌ సోమవారం రాత్రి ఘనంగా ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి కళాశాలలు, పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాల్గొని ఆట పాటలతో అలరించారు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని తప్పెట గుళ్లతో శంకరరావు బృందం ఆడి, పాడి అలరించింది. రేలా రే రేలా కార్యక్రమం ద్వారా జానకిరామ్‌ బృందం దేశభక్తి గీతాలు, మన జానపద గీతాలు ఆలపించి అందులో ఉండే ఆనందాన్ని వివరించింది.
స్వాతంత్య్ర పోరాట యోధులైన గాంధీజీ, భగత్‌ సింగ్‌ చరిత్రను కనుమరుగు చేసేందుకు పాఠ్యాంశాల నుంచి వాటిని తొలగిస్తున్నారని, వారు అందించిన పోరాట స్ఫూర్తితో ఉపాధి అవకాశాల కోసం, నిరుద్యోగ యువతను డ్రగ్స్‌ నుంచి దూరం చేసే విధంగా పోరాటాలు నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ కోరారు. విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రానున్న కాలంలో ఎస్‌ ఎఫ్‌ఐ నిర్వహించే పోరాట కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రామ్మోహన్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాము, సిహెచ్‌ వెంకటేష్‌ తదితరులు మాట్లాడారు.

➡️