పక్షపాతంగా వ్యవహరిస్తోన్న ఎన్నికల కమిషన్‌ – మాజీ మంత్రి పేర్ని నాని

Mar 31,2024 22:35 #perni nani, #press meet

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తెలుగుదేశం పార్టీ ఎన్ని పర్యాయాలు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించినా స్పందించని ఎన్నికల సంఘం వైసిపిపై ఎలాంటి విచారణ లేకుండానే చర్యలకు పాల్పడుతూ పక్షపాతంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం మొత్తం ప్రతిపక్షానికి లంగిపోయిందన్నారు. టిడిపి కార్యాలయం ఎదురుగా అడ్డగోలుగా ఫ్లెక్సీలు పెట్టినా స్పందించని ఎన్నికల కమిషన్‌ వైసిపి కార్యాలయం ఎదుట వున్న ఫ్లెక్సీలపై మాత్రమే చర్యలు తీసుకుంటోందన్నారు. అలాగే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైకిల్‌ గుర్తు వున్న బ్యాడ్జ్‌ను తగిలించుకుని రూ.3 లక్షల చెక్కులు ఇస్తుంటే ఎన్నికల సంఘం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. చెక్కుల పంపిణీని నిలిపివేయాలని తమ పార్టీ రెండు పర్యాయాలు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం కనీసం ఆమెకు నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల కోడ్‌ వచ్చేంత వరకు వలంటీర్లను దుర్మార్గులని విమర్శలు చేసిన టిడిపి, కోడ్‌ వచ్చాక వలంటీర్ల పట్ల కపట ప్రేమను ప్రదర్శిస్తోందని విమర్శించారు. టిడిపి దుర్మార్గపు చర్యలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలని కోరారు.

➡️