ప్రజాశక్తి – విజయవాడ అర్బన్ : రాజకీయాలను మతోన్మాదం, విద్వేషం శాసిస్తున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న 35వ పుస్తక మహోత్సవం ఎనిమిదో రోజు బుధవారం రామోజీరావు సాహిత్య వేదికపై ప్రజాశక్తి బుకహేౌస్ ప్రచురించిన ‘రైతును ముంచుతున్న పాలకుల విధానాలు’, ‘అసమానతలు – ఆర్థిక విధానాలు’, ‘విద్వేష రాజకీయాలు’ పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్ రచించిన ఈ పుస్తకాలను ఆవిష్కరించిన అనంతరం రాఘవులు మాట్లాడుతూ.. ప్రార్థనా స్థలాల చట్టాన్ని కూడా కొన్ని రాజకీయ పార్టీలు అపహాస్యం చేస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని కూడా రాజకీయాలూ, పెట్టుబడి విధానాలూ ప్రభావితం చేయడం శోఛనీయమన్నారు. ప్రకృతి వ్యవసాయం పేరుతో జంతువుల మధ్య కూడా వర్ణ వివక్ష ప్రదర్శించేలా పరిస్థితి కనిపిస్తోందన్నారు. ప్రకృతి వ్యవసాయం వెనుక కూడా వర్గపోరాట ధోరణిని ప్రతిబింబిస్తోందని వివరించారు. ప్రపంచంలో చాలా దేశాలకన్నా ఎక్కువగా భారతదేశంలో అసమానతలు ఎక్కువగా ఉండటం బాధాకరమన్నారు. పాత తప్పిదాలను సరి చేయడానికి కొత్త తప్పిదాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. దేశంలో ఐక్యతనూ, సమానత్వాన్నీ ఈ విద్వేషాలు చెడగొడతాయని వెల్లడించారు. సభకు అధ్యక్షత వహించిన ప్రజాశక్తి బుకహేౌస్ సంపాదకులు ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ.. నాగరికత పేరుతో సామాజిక అంశాలకు దూరం కావడం దురదృష్టకరమన్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మలచుకోవాలని సూచించారు.
సంప్రదాయ మూలాలను మరచిపోకూడదని తెలిపారు. రచయిత వి.రాంభూపాల్ మాట్లాడుతూ వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పెరగడం, వ్యవసాయ రుణాలు నిజమైన రైతులకు అందకపోవడం, గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతులకు వ్యవసాయం భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ప్రయోగాలు చేసినప్పుడు విజయం సాధించగలిగే పరిస్థితులు ఉంటాయ న్నారు. అలాంటి ప్రయోగాలకు ప్రభుత్వమూ, సమాజమూ మద్దతునివ్వాలని సూచించారు. వినిమయ సంస్కతి వల్ల అనేక పేద కుటుంబాలు నిరుపేదలుగా, దరిద్రులుగా మారిపోతున్నా యన్నారు. ప్రజాశక్తి బుకహేౌస్ జనరల్ మేనేజర్ కె.లక్ష్మయ్య మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక అంశాలపై తాము నిరంతరం కొత్త కొత్త రచనలను పాఠకులకు అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో వొరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.