6072 కోట్ల రూపాయల సర్దు”పోటు ”భారంతో బిల్లులు : సిహెచ్‌ బాబురావు

విజయవాడ : ఏనేడు విజయవాడ అజిత్‌ సింగ్‌ నగర్‌, 58వ డివిజన్‌ తదితర ప్రాంతాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబురావు, తదితర నేతలు పర్యటించారు. ఈ నెల వచ్చిన విద్యుత్‌ బిల్లులను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడారు. పెరిగిన విద్యుత్‌ బిల్లులు, మాట తప్పిన ప్రభుత్వ తీరును, అదానీతో కుమ్మక్కైన పాలకుల కుట్రలను ప్రజలకు వివరించారు. పెరిగిన విద్యుత్‌ బిల్లులపై పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ … కూటమి ప్రభుత్వంహొ అధికారంలోకి వచ్చి ఐదు నెలల తిరగకముందే 15,484 కోట్ల రూపాయల విద్యుత్‌ భారాన్ని ప్రజలపై వేయడం దారుణమన్నారు. 2022 -23 సంవత్సరాల్లో వినియోగించుకున్న విద్యుత్‌ పై 6072 కోట్ల రూపాయల సర్దుబాటు చార్జీల పేరుతో నేడు జనం నుండి వసూలు చేయటం శోచనీయమన్నారు. వచ్చే నెల నుండి 2023 -24 సర్దుబాటు చార్జీ 9412 కోట్ల రూపాయల భారం పడనున్నదని తెలిపారు. ఇప్పటికే 2014-19 ట్రూ అప్‌ చార్జీ గత నెల బిల్లులపై 40 పైసలు సర్దుబాటు చార్జీ వసూళ్లు చేస్తున్నారని అన్నారు. తాజాగా మూడవ సర్దుబాటు చార్జీ బిల్లులో వేశారనీ, వచ్చేనెల 4వ సర్దుబాటు చార్జీ కలపటానికి రంగం సిద్ధం అయ్యిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల బిల్లులలో 10 శాతం నుండి 30 శాతం వరకు బిల్లులు పెరిగాయన్నారు. నిరుపేదలపై మరింత భారం పడిందన్నారు. అజిత్‌ సింగ్‌ నగర్‌ లోని లింగం వెంకటలక్ష్మి కిహొమొత్తం 958 రూ” బిల్లు రాగా, అందులో 282 రూ”(30%)2022-23 సర్దుబాటు చార్జీ మోపారని ఆరోపించారు. విద్యుత్‌ ఛార్జీలు 30 శాతం ఉండగా సర్దుబాటు చార్జీలు, అదనపు చార్జీలు 70 శాతం ఉండటం దారుణమన్నారు. ఈ సర్దుబాటు చార్జీల పాపం పాలక పార్టీలన్నింటిదని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ, గతంలో పాలించిన వైసిపి, నేడు పాలిస్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు వీటికి బాధ్యత వహించాలన్నారు. చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని మాట ఇచ్చిన కూటమి, నేడు మాట తప్పింది, ప్రజలను వంచించింది అని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరి చేయాల్సిన బాధ్యత కూటమిపై ఉండగా, భారం మోపి చేతులు దులుపుకోవడం సరికాదు అని అన్నారు. ఒకవైపున సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ధరలు యూనిట్‌ 12 రూపాయల నుండి క్రమంగా రెండు రూపాయలకు తగ్గాయని చెబుతూనే, ఛార్జీలు మాత్రం తగ్గించకుండా పెంచడం అన్యాయమన్నారు. అదానీ వద్ద నుండి వందలాది కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని, ప్రజలపై భారాల మోపే ఒప్పందాలను బిజెపి, వైసిపి పార్టీలు చేశాయన్నారు. నేడు ఆ ఒప్పందాలను రద్దు చేయకుండా తెలుగుదేశం, జనసేన వారితో కుమ్మక్కు అవుతున్నాయని దుమ్మెత్తిపోశారు. అందుకే ఈ పాపం ఉమ్మడిగా బిజెపి, వైసిపి, తెలుగుదేశం, జనసేన అందరిదీ అన్నారు. బడా కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలు వలనే విద్యుత్‌ చార్జీలు పెరుగుతున్నాయన్నారు. ఒకవైపున కార్పొరేట్లతో కుమ్మక్కై పాలక పార్టీలు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు వెల్లడైనప్పటికీ కూటమి ప్రభుత్వం దానిపై విచారణ జరపకుండా, చర్యలు తీసుకోకుండా ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారాన్ని వేయటం అక్రమమన్నారు. పెరిగిన విద్యుత్‌ చార్జీలపై ప్రజలు గళం విప్పాలని, కేంద్ర, రాష్ట్ర పాలకులను నిలదీయాలని అని పిలుపునిచ్చారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన వైసీపీ పాపాన్ని గమనించాలన్నారు. మరో విద్యుత్‌ పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సర్దుబాటు చార్జీల భారాన్ని నిలిపివేయాలన్నారు. అదానీ, జగన్‌, కేంద్ర ప్రభుత్వ కుంభకోణంపై విచారణ జరపాలని, అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని, మాట ఇచ్చినట్లు విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్‌ మీటర్లను ఆపాలని డిమాండ్‌ చేశారు. నేడు జరిగిన పర్యటనలో సిపిఎం నేతలు బి.రమణరావు, కే.దుర్గారావు, సి.హెచ్‌.శ్రీనివాస్‌, నిజాముద్దీన్‌, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️