నగ ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్
పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు
పరారీలో ఇద్దరు
ప్రజాశక్తి-కంచికచర్ల (ఎన్‌టిఆర్ జిల్లా) : ఎన్‌టిఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిపై యువకుడు అత్యాచారం చేయడమే కాకుండా ఆమె నగ ఫొటోలు తీశారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే వీటినిబహిర్గతం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత నెలలో జరిగిన ఈ ఘటన బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం… తిరువూరుకు చెందిన విద్యార్థిని పరిటాలలోని ఒక వసతి గృహంలో ఉంటూ బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వసతి గృహం నుండి పరిటాల కళాశాలకు వెళ్తున్న ఆ విద్యార్థిని వెంట అదే గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ పడేవాడు. తనతో స్నేహం చేయాలంటూ చనువుగా ప్రవర్తిస్తూ ప్రేమలోకి దించాడు. విద్యార్థినికి మాయమాటలు చెప్పి రోజూ తన వెంట తీసుకెళ్లేవాడు. గత నెలలో హుస్సేన్ తన స్నేహితుడైన గాలి సైదా అలియాస్ సిద్ధూ గదికి ఆ విద్యార్థినిని తీసుకెళ్లాడు. అనంతరం ఆమెను గదిలో ఉంచి తాను బయటకు వెళ్లాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై అదే అదునుగా సైదా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఒంటిపై దుస్తులు లేకుండా ఫొటోలు తీసి ఎవరికైనా చెప్తే ఈ ఫొటోలు బహిర్గతం చేస్తానంటూ బెదిరించాడు. తనకు జరిగిన అన్యాయంపై ఆ విద్యార్థిని తల్లిదండ్రుల సహాయంతో కంచికచర్ల పోలీసులను ఆశ్రయించింది. తనపై అత్యాచారం చేసిన సైదా, తనను ప్రేమ పేరుతో మోసగించిన హుస్సేన్, వారిద్దరికీ సహాయం చేసిన చింతల ప్రభుదాస్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎసిపి తిలక్ మాట్లాడుతూ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన సైదాను అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన ఇద్దరూ పరారీలో ఉన్నారని తెలిపారు. కేసు ప్రాథమిక దశలో ఉందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో మహిళ ఎసిపి లతాకుమారి, నందిగామ గ్రామీణ సిఐ చవాన్, ఎస్‌ఐ బి.రాజు పాల్గొన్నారు.