- భవన నిర్మాణ కార్మిక సంఘం
ప్రజాశక్తి-కలెక్టరేట్ (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పలు మోసాలకు పాల్పడుతూ, తెలుగు ప్రజలను వంచిస్తుందని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) అధ్యక్షుడు కె నర్సింగరావు పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక, ప్రజాసంఘాల జెఎసి ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం నాటికి 1406వ రోజుకు చేరాయి. దీక్షల్లో సిఐటియు జగదాంబ జోన్ కమిటీ సభ్యులు కూర్చున్నారు. ఈ సందర్భంగా కె నర్సింగరావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వానికి ఎన్నికలు తప్ప, ప్రజల సంక్షేమం పట్టదని ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే తేటతెల్లం అవుతుందన్నారు. ఆనాడు రైతులు నల్ల చట్టాలు రద్దు చేయాలంటూ పోరాటం చేసినా, 700 మందికి పైగా రైతులు అసువులు బాసినా పట్టించుకోని బిజెపి ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సమీపించేసరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా రైతులకు క్షమాపణ చెప్పి నల్ల చట్టాలను రద్దు చేశారని గుర్తుచేశారు. ఈనాడు ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యతరగతికి మేలు చేసే బడ్జెట్‌గా అభివర్ణిస్తూ ఢిల్లీ గద్దే లక్ష్యంగా ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు సమస్యకు శాశ్వత పరిష్కారమైనటువంటి సొంత గనులు, సెయిల్‌లో విలీనం, ఉద్యోగులకు బకాయి జీతాలు చెల్లించకపోతే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు వై రాజు, ప్రొఫెసర్ ఎస్ సూరప్పుడు, కె సంతోష్ తదితరులు పాల్గొన్నారు.