మోడీ నుంచి దేశాన్ని రక్షించుకుందాం

Mar 1,2024 08:54 #CPM AP, #Seminar, #Uttarandhra, #Visakha

రాజ్యాంగాన్ని కాలరాసే బిజెపిని, దాన్ని బలపరిచే పార్టీలనూ ఓడిద్దాం

‘రాజ్యాంగ పరిరక్షణ’ సదస్సులో వక్తలు

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో  :దేశంలో ఏ మూలకు వెళ్లి.. ఎవరిని ప్రశ్నించినా గత పదేళ్లలో ధరలు పెరిగిపోయి బతకలేకపోతున్నామని చెబుతున్నారని, మోడీ పాలన పోయి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్నామని అంటున్నారని పలువురు వక్తలు తెలిపారు. రాజ్యాంగాన్ని, లౌకిక విలువలను బిజెపి నాశనం చేసిందని, అందుకే వచ్చే ఎన్నికల్లో ముద్దా(సమస్య)లా ? మోడీయా ? అన్న విషయాన్ని దేశ ప్రజలు తేల్చుకుని, నూటికి 90 శాతం ప్రజలు ఓట్లేసి బిజెపిని అధికారం నుంచి వెళ్లగొట్టాల్సి ఉందని పిలుపునిచ్చారు. గురువారం ఉదయం విశాఖలోని డాబాగార్డెన్స్‌ వద్దనున్న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో కిసాన్‌ సంయుక్త మోర్చా కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన ‘బిజిపి కో హఠావో.. దేశ్‌ కో బచావో’ నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు జరిగింది. కాంగ్రెస్‌ జాతీయ నాయకులు మణిశంకర్‌ అయ్యర్‌, స్వరాజ్య పార్టీ జాతీయ నాయకులు యోగేంద్ర యాదవ్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి, జై భారత్‌ పార్టీ నాయకులు వివి.లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య వక్తగా హాజరైన మణిశంకర్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. దేశాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ బారి నుంచి రక్షించుకోవడమే ధ్యేయంగా బిజెపియేతర పార్టీలు 2024 ఎన్నికల్లో పనిచేయాలన్నారు. మోడీ పాలనలో దేశంలో గణతంత్ర, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థలు కాలరాయబడ్డాయని, వచ్చే ఎన్నికల్లో బిజెపిని దేశం నుంచి వెళ్లగొట్టి లౌకిక ప్రజాస్వామ్యన్ని నిలబెట్టినప్పుడే అంబేద్కర్‌ రాజ్యాంగ విలువల పరిరక్షణ జరుగుతుందని అన్నారు. రామభక్తునిగా మోడీ ప్రచారం బూటకమని, గాంధీయే నిజమైన రామభక్తుడని, అయినా గాంధీ నిర్ణయాలను ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు సావర్కర్‌ వంటివారు వ్యతిరేకించారని అన్నారు. సావర్కర్‌ ఆశీస్సులున్న గాడ్సేనే గాంధీని హతమార్చాడన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు తిరస్కరిస్తున్నాయన్నారు. రాష్ట్రాల్లో తమకు లొంగని పార్టీలను మోడీ ఇబ్బంది పెడుతూ ఇడి, సిబిఐ నిఘా సంస్థలను ఉసిగొలుపుతోందని విమర్శించారు.

స్వరాజ్య పార్టీ జాతీయ నేత యోగేంద్రయాదవ్‌ మాట్లాడుతూ.. తెల్ల దొరలతో పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట వారసత్వాన్ని ఆంధ్రప్రజలు పుణికిపుచ్చుకుని త్వరలో జరిగే ఎన్నికల్లో మతోన్మాద కార్పొరేట్‌ శక్తుల నుంచి దేశాన్ని రక్షించుకోవాలన్నారు. బిజెపిని, దాన్ని బలపరిచే పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. పదేళ్లలో దేశాన్ని ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పి మోడీ ఓట్లడగడం లేదని, 50 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని చెబుతూ చమత్కారంగా ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో 45 శాతం నిరుద్యోగం పెరిగిపోయిందని, ఉత్తరప్రదేశ్‌లో 55 వేల పోలీసు పోస్టులకు పరీక్ష నిర్వహిస్తే 45 లక్షల మంది హాజరవ్వడంతో యుపి అంతా ట్రాఫిక్‌ జామ్‌ అయిపోవడం కళ్లారా చూశానన్నారు. తీరా వారంతా పరీక్ష రాసాక పేపర్‌ లీకై ఆ కాస్త పరీక్ష రద్దయిపోవడం గమనిస్తే దేశంలో పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుందన్నారు. కోవిడ్‌ కాలంలో ప్రజల ఆర్థిక పరిస్థితులు దిగజారిపోగా ఒక్క అదానీ ఆస్తులే రూ.66 వేల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్లకు ఎగబాకడం గమనార్హమన్నారు. రైతులకు కనీస మద్దతు ధర విషయంలోనూ బిజెపి దగా చేస్తోందని మండిపడ్డారు. ఎపిలో టిడిపి, జనసేన, వైసిపిల్లో ఎవరికి ఓటేసినా బిజెపికేసినట్టేనని అన్నారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వినాశకర విధానానికి విశాఖ కేంద్ర బిందువుగా నిలిచిందని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ను లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. రైల్వేజోన్‌ ఇవ్వకుండా చేశారన్నారు. వికసిత్‌ భారత్‌ నిర్మాణం కాకుండా విషాద భారత్‌ను మోడీ నిర్మిస్తున్నారని అన్నారు. సిపిఐ నాయకులు జెవి.సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మోడీ డొల్లగా మారుస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, విభజన హామీలు ముగిసిన అధ్యాయం కాదన్నారు. కేంద్రంతో పొత్తు కోసం టిడిపి, జనసేన వెంపర్లాడడం తగదన్నారు. జై భారత్‌ పార్టీ నాయకులు వివి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఇటీవల మోడీ ద్వారకా సముద్ర గర్భంలోకి వెళ్లినట్లు చూశానని, బంగాళాఖాతంలోకీ వెళ్లాలని ఎద్దేవా చేశారు. సదస్సులో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, కిల్లో సురేంద్ర, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.రమేష్‌, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ ఎ.అజశర్మ, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేషు, భారత్‌ బచావో సంస్థ కన్వీనర్‌ గూడూరు సీతామహాలక్ష్మి పాల్గొన్నారు. సదస్సులో రాజ్యాంగాన్ని రక్షించాలంటూ సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు తీర్మానం ప్రవేశపెట్టగా సదస్సు ఏకగ్రీవంగాఆమోదించింది.

 

 

 

➡️