BJP : మరోసారి రాజ్యసభకు ఆర్‌.కృష్ణయ్య

Dec 9,2024 15:54 #MP, #R Krishnaiah, #rajyasabha

అమరావతి :  ఆర్‌. కృష్ణయ్య మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈసారి ఈయన పేరును బిజెపి ప్రకటించింది. తాజాగా బిజెపి రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్‌. కృష్ణయ్య పేరును బిజెపి ప్రకటించింది.   ఇక హర్యానా నుంచి రేఖా శర్మ.. ఒడిశా నుంచి సుజీత్‌ కుమార్‌లను బిజెపి తమ అభ్యర్థులుగా వెల్లడించింది.

కాగా, గతంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి కృష్ణయ్య రాజ్యసభలో అడుగుపెట్టారు. దాదాపు ఆయన రెండేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే, ఏపీలో వైసీపీ ఓటమి పాలు కావడంతో.. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన పూర్తిస్థాయిలో బీసీ సమస్యలపై ఉద్యమం చేస్తానని ప్రకటించారు.  కానీ, బీజేపీ జాతీయ నేతలు, ఏపీ కూటమి నేతలు కూడా  ఆయనతో చర్చలు  జరిపారు. దీంతో ఆయన మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్న ఆర్‌.కృష్ణయ్యకు ఏపీలోని కూటమి ప్రభుత్వం  పూర్తి మద్దతు ప్రకటించింది.

దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు డిసెంబర్‌ 20న ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు స్థానాలు, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, హర్యానాలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసిన విషయం విదితమే..

➡️