CPM: ప్రాంతీయ పార్టీల భుజాలెక్కి స్వారీ

  • కేంద్రంలో మోడీ నడుపుతున్నది సంకీర్ణ ప్రభుత్వం

ఎన్నికల్లో బిజెపిని తిరస్కరించిన ప్రజలు
మతతత్వ రాజకీయాలకు కట్టడి
రాజ్యాంగ పరిరక్షణకు ఓటు
బాబు, నితీష్‌ ఆలోచించుకోవాలి
దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తున్న బిజెపి
సిపిఎం విస్తృత సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్రంలో గత పదేళ్లుగా బిజెపి, మోడీ అనుసరించిన మతతత్వ రాజకీయాలను, రాజ్యాంగ విధ్వంసాన్ని సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని, అందువల్లే బిజెపి గతం కంటే గణనీయంగా సీట్లు కోల్పోయిందని, సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ రాలేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఏ.బేబీ అన్నారు. రెండు రోజులపాటు జరిగే సిపిఎం రాష్ట్ర విస్తృత సమావేశం శుకవ్రారం ఉదయం వడ్డేశ్వరంలోని సుందరయ్య స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లో ప్రారంభమైంది. సమావేశ ప్రారంభసూచకంగా పార్టీ పతాకాన్ని సీనియర్‌ నాయకులు వై.కేశవరావు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ప్రారంభ సభలో ఏం.ఏ.బేబీ మాట్లాడుతూ గత పదేళ్లుగా తీవ్ర మతోన్మాద విధానాలు అనుసరించిన బిజెపి, సంఘపరివార్‌ శక్తులకు ఈ ఎన్నికల్లో అడ్డుకట్ట పడిందని అన్నారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను నెలకొల్పి 2025లో వందేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో దేశంలో హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు బిజెపి విశ్వప్రయత్నాలు చేసిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా దేశంలో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకుని మెజార్టీ సాధించాలని ప్రయత్నించిందన్నారు. అయితే దేశంలో అనేక పార్టీలు బిజెపి తీరును తీవ్రంగా వ్యతిరేకించాయని, వ్యతిరేకించిన ఇద్దరు సిఎంలను జైల్లో పెట్టించి నియంతృత్వంగా వ్యవహరించిందని విమర్శించారు. వీటిని ప్రజలు సహించలేదని, రాజ్యాంగాన్ని మార్చి మత రాజ్యాన్ని ఏర్పాటు చేయాలన్న బిజెపి, సంఘ పరివార్‌ కుయుక్తులను ప్రజలు ఎన్నికల్లో అడ్డుకున్నారని తెలిపారు. గతం కంటే బిజెపి పార్లమెంటులో 20 శాతం సంఖ్యాబలాన్ని కోల్పోయిందని అన్నారు. అయితే టిడిపి, జెడియు లాంటి పార్టీల భుజాలపైకెక్కి బిజెపి స్వారీ చేస్తోందని, వారు పునరాలోచించుకోవాలని కోరారు. ఒక్కసారి బిజెపితో పొత్తు పెట్టుకుంటే దృతరాష్ట్ర కౌగిలిలో ఇరుక్కున్నట్లేనని హెచ్చరించారు. బిజెపి ఫాసిస్టు విధానాలను అర్థం చేసుకోలేని కొన్ని ప్రాంతీయ పార్టీల వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి ఓట్లు పెరిగాయని, దీని ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి అప్రమత్తం కావాలని అన్నారు. కేరళలో బిజెపి గెలిచిన త్రిస్సూర్‌లో కాంగ్రెస్‌ ఓట్లు తగ్గాయని, లెఫ్ట్‌ ఓట్లు చెదరలేదని, దీన్నిబట్టి కాంగ్రెస్‌ ఓట్లు బిజెపికి బదిలీ అయినట్లు అర్థమవుతోందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో గతంలో ఉన్న బిజెపి సీట్లు తగ్గాయని, ఆ పార్టీకి రాజకీయ అస్త్రంగా మారిన అయోధ్యలో బిజెపి అభ్యర్థి ఓడిపోయారని పేర్కొన్నారు. ఒకవైపు పార్లమెంటులో పూర్తి మెజార్టీ లేకపోయినా నియంతృత్వ విధానాలను బిజెపి కొనసాగిస్తోందని, 150 మంది ఎంపిలను ఒకేసారి సస్పెండ్‌ చేసిన ఓం బిర్లా లాంటి వ్యక్తిని మరలా స్పీకర్‌ను చేసిందని సంఘపరివార శక్తులకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. బిజెపి ప్రమాదాన్ని ఎపిలో చంద్రబాబు, బీహార్లో నితీష్‌ గుర్తించాలని, లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. గత ఎన్నికలతో పోలిస్తే వామపక్షాలు, సిపిఎం స్వల్పంగా బలపడ్డాయని, వచ్చిన సీట్ల, ఓట్ల సంఖ్య పెరిగిందని అన్నారు. ఆ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై నిలబడి పోరాడాలని, మతతత్వ రాజకీయాలను ఎదుర్కొవాలని సూచించారు. రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యరేతికిస్తామని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు దానిని కాపాడటం ఆయన బాధ్యతని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును, అమరావతి రాజధానిని పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉందని అన్నారు. ప్రారంభ సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవు లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ.గఫూర్‌, మాజీ ఎంపి పి.మధు పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సమావేశాలకు ఎం.ఏ.గఫూర్‌, కె.లోకనాథం, డి.రామదేవి, పి.అప్పలనర్స అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. తొలుత పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సమావేశానికి ఆహ్వానం పలికి, నిర్వహణ కమిటీలను ప్రకటించారు.

 

➡️