ప్రజాశక్తి-వేముల (వైఎస్‌ఆర్) : నిద్రిస్తున్న సమయంలో మంచం కింద డిటొనేటర్లు పెట్టి పేల్చడంతో విఆర్‌ఎ మృతి చెందారు. ఈ ఘటన వైఎస్‌ఆర్ జిల్లా వేముల మండలం వి.కొత్తపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. విఆర్‌ఎ నరసింహులు(45) తన భార్య సుబ్బలక్షుమ్మతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారి మంచం కింద డిటొనేటర్లు పెట్టి పేల్చారు. పేలుడు దాటికి నరసింహులు గాలిలోకి ఎగిరి కిందపడ్డాడు. సుబ్బలక్షుమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ భార్యభర్తలను వేంపల్లెలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నరసింహులు మృతి చెందారు. సుబ్బలక్షుమ్మ కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు సోమవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. డిటొనేటర్లు, పేలుడుకు ఉపయోగించిన ఒక పెట్టెను స్వాధీనం చేసుకున్నారు. విఆర్‌ఎ నరసింహులు హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధంగా భావిస్తూ ఇద్దరి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం.