– ఎపి కౌలు రైతు సంఘం డిమాండ్
ప్రజాశక్తి-ఒంగోలు సిటీ : పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరపై ‘బోనస్’ ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుసంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం ఒంగోలు సుందరయ్య భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు మాట్లాడారు. రైతు సంక్షేమ ప్రభుత్వాలుగా ప్రచారం చేసుకునే పాలకవర్గాలు ఆచరణలో మాత్రం రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. బహిరంగ మార్కెట్‌లో క్వింటాలు మిర్చి రూ.12 వేలు కొనుగోలు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.11,780 ‘మద్దతు ధర’ ప్రకటించడం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేశారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం ఇప్పటివరకూ అమలు చేయలేదని, కౌలురైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన చట్టాలేవీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఖరీఫ్ సీజన్ వస్తున్నా ప్రభుత్వం ‘పంటల బీమా’ అమలు చేయకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ‘కోకో సాగు’ ను ప్రోత్సహించిన కంపెనీలు కొనుగోలు పట్ల ఆసక్తి చూపడం లేదని, ‘ఊరగాయ’ పెట్టుకోమని రైతులను కంపెనీలు ఎగతాళి చేస్తున్నాయని విమర్శించారు. పంటల గిట్టుబాటు ధరల కోసం 15న కోకో రైతులు, పొగాకు, మిర్చి రైతులు 16న గుంటూరులో ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. సంఘం జిల్లా కార్యదర్శి వి.బాలకోటయ్య మాట్లాడుతూ.. కౌలు రైతులందరికీ బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
