ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక

ధ్రువీకరణ పత్రం అందజేత
ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : స్థానిక సంస్థల కోటాలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయగా అందులో షేక్‌ షఫీ ఉల్లా ఈ నెల 14న నామినేషన్‌ ఉపసంహరించుకుంటున్నట్టు అంగీకార పత్రం అందజేశారు. దీంతో వైసిపి నుంచి నామినేషన్‌ వేసిన బొత్స సత్యనారాయణ ఒక్కరే బరిలో నిలిచారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొంటూ సంబంధిత పత్రాన్ని రిటర్నింగ్‌ అధికారి కె.మయూర్‌ అశోక్‌ తన కార్యాలయంలో బొత్సకు అందజేశారు. వైసిపి నేతలు, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి బొత్స సంబంధిత పత్రాలపై సంతకాలు చేసి ఆర్‌ఒ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, మేయర్‌ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీలు సురేష్‌ బాబు, వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, జడ్‌పి చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ ఎమ్మెల్యేలు కన్నబాబు రాజు, ధర్మశ్రీ, అదీప్‌ రాజు, నాగిరెడ్డి, కంబాల జోగులు ఇతర నేతలు ఉన్నారు.

ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు
ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ మంచి రోజున తాను ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. తనకు వైసిపి తరఫున పోటీ చేసేందుకు బి-ఫారం ఇచ్చిన పార్టీ అధ్యక్షులు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలియజేశారు.

➡️