హైదరాబాద్ : ఉన్నట్టుండి డ్రైవర్ అస్వస్థతకు గురికాగా.. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన కత్తిపూడి హైవేపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుంచి భద్రాచలం వైపు వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు కత్తిపూడి హైవేపైకి రాగానే ఉన్నట్టుండి డ్రైవర్‌కు బీపీ లెవెల్స్ పడిపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు కూడా ఉండగా, వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు అన్నవరం ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందజేస్తున్నారు.
