బిఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం నిర్వహణకు పిపిపి మోడ్‌ వొద్దు : సిపిఎం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడలోని పిడబ్ల్యుడి గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్మృతి వనాన్ని పిపిపి పద్ధతిలో నిర్వహించాలన్న ఆలోచనను ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం లేఖ రాశారు. ఈ ప్రక్రియకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ప్రకటన జారీ చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ ఆలోచన సామాజిక స్ఫూర్తికి పూర్తి విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. విజయవాడ ప్రజలందరికీ ఉపయోగపడుతున్న పిడబ్ల్యుడి గ్రౌండ్‌ను అంబేద్కర్‌ స్మృతి వనంగా తయారుచేసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ వచ్చి స్మృతి వనాన్ని సందర్శించి ముగ్దులవుతున్నారని తెలిపారు. విజయవాడలో ఇటువంటి పర్యాటక ప్రదేశం మరొకటి లేదన్నారు. దీనిని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేసి, థియేటర్‌, ఆడిటోరియం, బుక్‌స్టాల్స్‌, ఇతర సౌకర్యాలు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే విజయవాడ నగరానికి తలమానికంగా ఉంటుందన్నారు. అంతేకానీ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వారికి అప్పజెప్పడమంటే స్మృతి వనాన్ని పూర్తిగా కమర్షియల్‌ ప్రయోజనాలకు ఉపయోగించటమే అవుతుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే స్మృతి వనాన్ని ప్రైవేటుపరం చేయాలనే ఆలోచన సరైంది కాదన్నారు. వెంటనే అటువంటి ఆలోచన విరమించుకోవాలని సిఎంను కోరారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్మృతి వనం నిర్వహణకు శాశ్వత నిధిని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీని అభివృద్ధి కోసం రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

➡️