హైదరాబాద్: తమ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బిఆర్‌ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పది మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలవుతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది. నోటీసు కూడా ఇవ్వలేదని తెలిపింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ఎస్‌ఎల్‌పి దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
గతంలో కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పుని ఆమలు చేయాలని బిఆర్‌ఎస్ కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ 3నెలల్లోపే తమ నిర్ణయం వెల్లడించాలని కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ ప్రస్తావించింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
