మచిలీపట్నంలో వడ్డీ వ్యాపారి హత్య

ప్రజాశక్తి – మచిలీపట్నం రూరల్‌ (కృష్ణా జిల్లా) : కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో వడ్డీ వ్యాపారి హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం…. మచిలీపట్నం చిలకలపూడికి చెందిన అడపాల రవి (50) వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. వారం రోజుల క్రితం రేవతి సెంటర్లో ఓ ముఠాతో ఆయన ఘర్షణ పడ్డారు. రవి ముఠాలోని ఒకరిని కొట్టారు. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న రవిని సదరు ముఠాలోని ముగ్గురు వ్యక్తులు పథకం ప్రకారం మంగళవారం రాత్రి వెంబడించి చిలకలపూడిలోని ఆయన ఇంటి ముందే కత్తులతో పొడిచారు. కత్తిపోట్లకు తీవ్రంగా గాయపడిన రవి రక్తంమోడుతూనే సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లడంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రవి మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్‌పి ఆర్‌ గంగాధరరావు ఆదేశాల మేరకు సిసి కెమెరాల ఫుటేజీల ఆధారంగా హంతకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

➡️