ప్రజాశక్తి-ధర్మవరం టౌన్ : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణ నాగులబావి కాలనీకి చెందిన బిఎస్‌ఎఫ్ జవాను వెంకటరమణారెడ్డి (40) కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… చెన్నేకొత్తపల్లి మండలం బసినేపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి బిఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం వీరి కుటుంబం ధర్మవరం పట్టణంలో నివాసం ఉంటోంది. ఇటీవల కాశ్మీర్‌లో అతి తక్కువ ఉష్ణోగ్రత ఉండడంతో వెంకటరమణారెడ్డి బుధవారం నాడు గుండెపోటుకు గురై మరణించాడు. ఈ మేరకు సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు అందించారు. మృతునికి భార్య హరిప్రియ, కుమారుడు మహిధర్ రెడ్డి, కుమార్తె రిత్విక ఉన్నారు. జవాను పార్థివదేహం కాశ్మీర్ నుంచి ధర్మవరానికి గురువారం రాత్రి చేరుకుంటుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. జవాను స్వగ్రామం బసినేపల్లిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. జవాను ఆకస్మిక మృతిపై గ్రామస్తులు, స్నేహితులు, మాజీ ఆర్మీ ఉద్యోగులు సంతాపం తెలిపారు.
