బడ్జెట్‌ కాపీలు దగ్ధం

Feb 6,2025 00:17 #Budget, #disappointed, #farmers
  • ఎస్‌కెఎం ఆధ్వర్యంలో నిరసన
  • రైతులను నిరాశపరిచిన బడ్జెట్‌: కేశవరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైతులను నిరాశపరిచిందని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సంయుక్త కిసాన్‌ మోర్చ(ఎస్‌కెఎం) ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో బడ్జెట్‌ కాపీలను తగులబెట్టారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ రైతాంగ సమస్యలను కేంద్రప్రభుత్వం తన బడ్జెట్‌లో ప్రస్తావించలేదని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం నియమించిన పార్లమెంటరీ కమిటీ చెప్పిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. రైతుల పంటకు మద్దతు ధర ప్రకటించాలని, రుణమాఫీ చేయాలని, ప్రస్తుతం ఇస్తున్న రైతు భరోసాను రెట్టింపు చేయాలని కమిటీ ప్రతిపాదించిందన్నారు. ధరల స్థిరీకరణ నిధి గురించి ప్రస్తావించలేదన్నారు. కేంద్రం కేవలం మూడు పంటలను కొంటామని చెప్పిందన్నారు. ధాన్యం, మిర్చి, పత్తి, పొగాకు వంటి పంటలను విస్మరించిందని చెప్పారు. కార్పొరేట్‌లకు అనుకూలంగానే బడ్జెట్‌ ఉందని విమర్శించారు. ఎపి రైతుసంఘం(దాసరి భవన్‌) అధ్యక్షులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ వ్యవసాయ, తయారీ సేవల రంగాలపై కార్పొరేట్‌ ప్రభావాన్ని పెంచే విధంగా ఈ బడ్జెట్‌ను రూపొందించారని తెలిపారు. మద్దతు ధరకు చట్టపరమైన హామీ లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఏఐకెఎఫ్‌ అధ్యక్షులు మర్రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతుల న్యాయమైన డిమాండ్లను ఏళ్లతరబడి కేంద్రం పెండింగ్‌లో ఉంచిందన్నారు. రైతులను దగా చేసే విధంగా బడ్జెట్‌ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌ రెడ్డి, ఏఐకెఎఫ్‌ నాయకులు కాసాని గణేష్‌బాబు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు దడాల సుబ్బారావు, నాయ కులు పివి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

➡️