బడ్జెట్‌ప్రతులు దహనం

  • మధ్య తరగతి బడ్జెట్‌ కాదు..కార్పొరేట్‌ బడ్జెట్‌
  • రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు

ప్రజాశక్తి – యంత్రాంగం : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన కేటాయింపులు చేయకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నిరసనలు చేపట్టారు. బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర బడ్జెట్‌ ఉందని, సామాన్యులకు ఏటువంటి ప్రయోజనం చేకూర్చేలా లేదని పలువురు నాయకులు విమర్శించారు. ఈ బడ్జెట్‌ను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాజధాని అమరావతి, కడప ఉక్కు, విశాఖస్టీల్‌కు నిధుల ఊసేలేదని విమర్శించారు.

నెల్లూరులో మినీ బైపాస్‌రోడ్డు వివేకానంద పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఎం మహాసభలు జరుగుతోన్న అనిల్‌ గార్డెన్‌ నుంచి వివేకానంద పార్కు వరకు ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బడ్జెట్‌కు వ్యతిరేకంగా నినదించారు. కేంద్ర బడ్జెట్‌ రైతు వ్యతిరేకమైనదని, ఇది కార్పొరేట్‌ శక్తుల అనుకూల బడ్జెట్‌ అని, సంపన్నులకు ఊడిగం చేసే బడ్జెట్‌ అని నాయకులు విమర్శించారు. సాధారణ ప్రజలందరూ ఈ బడ్జెట్‌ను వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిఐటియు ఆల్‌ ఇండియా అధ్యక్షులు హేమలత, అల్‌ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, సిఐటియు ఆల్‌ ఇండియా కోశాధికారి సాయిబాబు, సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్‌ నర్సింగరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణయ్య, కె.ప్రభాకర్‌ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆల్‌ ఇండియా నాయకులు ఆర్‌ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం టవర్‌క్లాక్‌ వద్ద బడ్జెట్‌ ప్రతులను దహనం చేసి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ఈ బడ్జెట్‌లో ఎటువంటి నిధులూ కేటాయించలేదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకటనారాయణ, ముత్తుజ విమర్శించారు. కార్పొరేట్‌కు అనుకూలమైన ఈ బడ్జెట్‌ను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. కర్నూలు, నంద్యాల, కోవెలకుంట్ల, ఆత్మకూరు, నందికొట్కూరులో ఆందోళనలు చేపట్టారు. కడపలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్‌ నేతృత్యంలో బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో విభజన హామీలు, కడప ఉక్కు ఉసే లేదని విమర్శించారు. బద్వేల్‌లో అంబ్కేదర్‌ సర్కిల్‌ వద్ద నిరసన తెలియజేశారు. వేంపల్లెలో కాంగ్రెస్‌ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ప్రకాశం జిల్లా అద్దంకి బస్టాండ్‌ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కాలం సుబ్బారావు మాట్లాడుతూ.. బడ్జెట్‌లో ప్రకాశం జిల్లాకు ఎటువంటి ప్రాధాన్యత కల్పించకుండా మొండి చెయ్యి చూపారని విమర్శించారు. ఇది మధ్య తరగతి బడ్జెట్‌ కాదని, కార్పొరేట్‌ బడ్జెట్‌ అని మండిపడ్డారు. బాపట్లలో పాత బస్టాండ్‌ ఆటో స్టాండ్‌ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రూరల్‌ తోకతిప్పలో, యలమంచిలి మండలం చించినాడ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు.

తాడేపల్లిగూడెంలో పుచ్చలపల్లి సుందరయ్య భవనం నుంచి పోలీసు ఐల్యాండ్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. తణుకులోని అమరవీరుల భవనం వద్ద బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో, గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లి సెంటర్‌, ప్రాతూరులోని బైపాస్‌ రోడ్డు వద్ద నిరసనలు తెలిపారు. మంగళగిరి పట్టణం, మంగళగిరి మండలంలోని నిడమర్రు, తుళ్లూరులో, ఫిరంగిపురం మండలం పొనుగుపాడు, దుగ్గిరాల, తెనాలిలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట, విజయనగరం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ జంక్షన్‌, గజపతినగరం నాలుగు రోడ్ల జంక్షన్‌, పార్వతీపురం, సాలూరు, కొమరాడ మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. అల్లూరి జిల్లా ఎటపాక మండలం గుండాల కాలనీ వద్ద బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. విఆర్‌.పురం మండలం రేఖపల్లి జంక్షన్‌లో నిరసన తెలిపారు.

➡️