విద్యార్థి యువజన సంఘాల డిమాండ్
ప్రజాశక్తి-ఆదోని : ఆదోనిలో ప్రభుత్వ వైద్య కళాశాలను తక్షణమే నిర్మించి, తరగతులు ప్రారంభించాలని విద్యార్థి యువజన సంఘాల జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ అభివృద్ధిలో వెనుకబడిన ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తారని అందరం హర్షించామన్నారు. ప్రభుత్వాలు మారడంతో కళాశాలకు గ్రహణం ఏర్పడడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆదోనిలో అర్థాంతరంగా నిలిచిపోయిన మెడికల్ కళాశాల పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆదోనిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభిస్తే చుట్టూ పక్కల ప్రజానీకానికి మంచి వైద్యం అందుబాటులోకి వస్తుందని స్థానిక రెవిన్యూ డివిజన్‌లోని బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్య అందుతుందన్నారు. కేంద్రంతో సంప్రదించి ఐదు కళాశాలలకు అనుమతులు తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పులివెందులకు వచ్చిన 50 సీట్లు కూడా వసతులు కల్పించలేమని ఎన్‌ఎంసికి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క పాడేరుకే 50 సీట్లు వచ్చాయని, మిగిలిన నాలుగు కళాశాలలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఒపి ఇచ్చి ఉంటే అనుమతులు లభించి ఉండేవని తెలిపారు. 700 సీట్లు ప్రభుత్వ నిర్లక్ష్యపు చర్య వల్ల కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం వైద్య విద్యను ప్రయివేటీకరణ చేయాలనే దుర్మార్గపు చర్యగా భావిస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, సంఘాల నాయకులు తాము నిర్వహించే ఉద్యమానికి కలిసి రావాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి సాబీర్ బాష, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు అఖండ, జిల్లా కోశాధికారి సోమశేఖర్, డిఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉదరు, బిడిఎస్‌ఎఫ్ రాష్ట్ర కన్వీన రమేష్, ఎస్‌ఎస్‌యుఐ డివిజన్ అధ్యక్షులు బాలు, డివైఎఫ్‌ఐ నాయకులు గోవిందరాజులు మాట్లాడారు.
