విశాఖలో భావన నిర్మాణ కార్మికులు భారీ ర్యాలీ
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : కూటమి పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్దరించి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ గురువారం విశాఖపట్నంలో విశాఖ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లలిత జ్యువెలరీ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ గురజాడ జంక్షన్, ఆసీలిమెట్ట జంక్షన్ మీదుగా సాగి, జివిఎంసి గాంధీ విగ్రహం వద్దకు చేరింది. ర్యాలీకి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి.వెంకటరావు, అధ్యక్షురాలు పి. అనసూయ, ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాసరావు, సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కె ఎస్ వి కుమార్ తదితరులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు ద్వారా గత అనేక సంవత్సరాలుగా అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపేస్తూ గత వైసిపి ప్రభుత్వం 1214 మెమో జారీ చేసిందన్నారు. ఫలితంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారన్నారు. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్దరిస్తామని, బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయిస్తామని హామీ ఇచ్చిందన్నారు. దాంతో గత వైసిపి ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్న భవన నిర్మాణ కార్మికులు తెలుగుదేశం పెట్టిన మ్యానిఫెస్టోను గురించి విశ్వసించి ఓట్లు వేశారన్నారు. ఫలితంగానే తెలుగుదేశం, జనసేన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అత్యధిక మంది గెలుపొందారన్నారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నవారు భహిరంగంగానే ప్రకటించారన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అన్ని రాష్ట్రాల్లో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. మొన్నటి వరకు కలిసి వున్న తెలంగాణా రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అమలవుతున్న సంక్షేమ పథకాలకు అదనంగా కొత్త పథకాలు ప్రారంభించి అమలు చేస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో మాత్రం 1214 మెమో ఇచ్చి అమలువుతున్న సంక్షేమ పథకాలు ఆపివేశారన్నారు. సంక్షేమ పథకాలను ఆపి వేసిన ఫలితంగానే గత వైసిపి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకతకు గురైందన్నారు. ఎన్నికలకు ముందు టిడిపి హామి ఇచ్చినట్లుగా రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలను అమలు చెయ్యవల్సిందిగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు జి.పోలేశ్వరరావు, కె.నర్సింగరావు, సిఐటియు నాయకులు పి.మణి, పి.వెంకటరావు తదితరులు నాయకత్వం వహించారు. ర్యాలీ అనంతరం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
