పెంపుదల లేదంటూనే భారాలు

అమరావతి : ప్రజలపై మోపుతున్న అదనపు విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా, ట్రూ అప్‌, సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్‌ మీటర్లను పెట్టొద్దని, అదానీతో చేసుకున్న సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ.. మంగళవారం విజవాడలో ఎ కన్వెన్షన్‌ సెంటర్‌ నందు ఏపీ వామపక్ష పార్టీలన్నీ సామూహిక రాయబార కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది. ఎన్నికలకు ముందు ఒకమాట. ఇప్పుడొక మాట చెబుతోంది. ఆరోజు విద్యుత్‌ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పింది. కానీ ఈ ఆరునెలల్లోనే ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో సర్వీస్‌ ఛార్జీల పేరుతో 16 వేల కోట్ల రూపాయల భారం మోపింది. దాదాపు ఈ కొద్ది నెలల్లోనే గృహ వినియోగదారులపైన రెట్టింపు భారం పడింది. ఇప్పుడు అది చాలక 2024-25 సంవత్సర కాలానికి ప్రభుత్వం 5,900 కోట్ల రూపాయల లోటు చూపిస్తుంది. ఈ లోటును ప్రభుత్వం భరిస్తుందని చెప్పలేం. ప్రభుత్వం భరించకపోతే రాబోయే రోజుల్లో 5,900 కోట్ల రూపాయల భారం గృహ వినియోగదారులపై పడుతుంది. అంటే ఒకరకంగా లోపాయికారీతనంగా ప్రభుత్వం నడుపుతోంది. గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు ప్రభుత్వం భరించకుండా.. ప్రజలపై నెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఆ పాపానికి మీరే దోషులవుతారు’ అని వి. శ్రీనివాసరావు టిడిపి కూటమి నేతలను హెచ్చరించారు.

➡️