మండుతున్న ఉత్తరాంధ్ర

May 29,2024 08:25 #Summer, #Uttarandhra
  • ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరే అవకాశం
  • వాతావరణశాఖ అంచనా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో వేసవి తీవ్రత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు మండలాల్లో ఈ నెల 31వ తేదీ నాటికి 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. కాకినాడ జిల్లాలో కొత్తపల్లి, తుని, తొండంగి మండలాల్లో 30వ తేదీన 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వొచ్చని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రకృతి విపత్తుల నిర్వహణశాఖ అంచనా ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, కంచిలి, కవిటిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వొచ్చు. 29, 30, 31 తేదీల్లోనూ పలు మండలాల్లో 49 డిగ్రీలు నమోదుకానుంది. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, పూసపాటిరేగలో 49 డిగ్రీల వరకూ వెళ్లొచ్చని తెలిపింది. విశాఖపట్నం జిల్లాలో 47 డిగ్రీలు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో 30వ తేదీన 46 డిగ్రీల నుండి 47 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు ఉండొచ్చని తెలిపింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. తిరుపతిలో మాత్రం 46 డిగ్రీల వరకూ నమోదవ్వొచ్చని పేర్కొంది.

➡️