స్వగ్రామాలకు పయనమైన జనంతో బస్‌ స్టేషన్లలో రద్దీ

Nov 29,2023 16:41 #bus station, #traffick

తెలంగాణ: ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఉంటూ స్వగ్రామంలో ఓటు ఉన్న వారు సొంతూళ్లకు వెళ్లేందుకు పయనమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి పల్లెబాట పట్టడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌(ఎంజీబీఎస్‌), సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌, ఉప్పల్‌ కూడలి, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ జంక్షన్‌ ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రయాణికుల రద్దీని బట్టి అదనంగా బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతుండగా.. బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంజీబీఎస్‌ నుంచి ప్రతి రోజు 3,500 బస్సులు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో 4,500 బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఎంజీబీఎస్‌లో ఉదయం నుంచి ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలకు వెళ్లే వారితో ఎక్కువ రద్దీ ఉందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కొనసాగనున్న విషయం తెలిసిందే.

➡️