మిర్చికి క్వింటాలు రూ. 20 వేలకు కొనండి

  • మండలిలో కెఎస్‌ లక్ష్మణరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఈ ఏడాది ధరలు లేక మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కె.ఎస్‌. లక్ష్మణరావు తెలిపారు. రైతు సమస్యలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ మిర్చికి గత ఏడాది వరకు క్వింటాలు కనీస ధర రూ.18 వేలు, గరిష్టంగా రూ.27 వేలకు పలికిందని కానీ ఈ ఏడాది కనీస ధర రూ. 9 వేలకు తగ్గిందని గరిష్ట ధర రూ.13 వేలకు కొంటున్నారని దీని వల్ల రైతులకు ఎకరాకు రూ.10 వేలు నష్టం వస్తుందన్నారు. నల్లతామర వల్ల దిగుబడి తగ్గిందని తెలిపారు. పత్తి కొనుగోలు చేయాల్సిన సిసిఐ ప్రేక్షకపాత్ర పోషించిందని రైతుల నుంచి మద్ధతు ధర రూ.7521కి కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం రూ.5 వేలుకు వ్యాపారులు కొంటున్నారని తెలిపారు. మార్కెట్‌ యార్డులో కొనుగోలు చేయాల్సిన సిసిఐ జిన్నింగ్‌ మిల్లుల్లో కొనుగోలు చేస్తుందని దీని వల్ల రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో శనగల ధర పడిపోయిందని, క్వింటాలు రూ.5వేలకు కొంటున్నారని తెలిపారు. కోకో పంట ధర కూడా బాగా పడిపోయిందన్నారు.బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో 2 లక్షల ఎకరాల్లో పండించిన బర్లీ పొగాకుకు ధర లేదని, పొగాకు బోర్డు తమకు బర్లీ పొగాకు తమకు సంబంధం లేదని చెబుతోందని ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ ఏడాది ఉత్తత్తి అయిన ధాన్యం దిగుబడులు ఇంకా 60 శాతం వరకు పొలాల్లో కుప్పలు వేసి ఉంచారని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. ధరల స్థిరీకరణ నిధిని రూ.300 కోట్లకు పరిమితం చేయడం తగదన్నారు. ప్రస్తుతం ఉన్న కౌలు రైతు చట్టం మార్పునకు చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటూరు జిల్లాలో 40 వేల మంది రైతులకు సిసిఆర్‌సి కార్డులు ఇచ్చినా ఐదు వేల మందికి కూడా రుణాలు ఇవ్వలేదన్నారు. ఆత్మహత్యల్లో కౌలు రైతులు 95 శాతం ఉంటున్నారని ఆయన గుర్తు చేశారు. పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి రైతులకు మేలు చేయాలన్నారు.

➡️